ఆనందయ్య మందు పంపిణీ జరగదు.. ఎవరూ రావొద్దు!

నెల్లూరు: ఆనందయ్య మందు పంపిణీపై ఆయన అనుచరుడు సంపత్‌రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. మందు పంపిణీకి ప్రభుత్వ సహాకారం లేదని, మందు పంపిణీ జరగదని ఆయన తెలిపారు. దయచేసి ఎవరూ కృష్ణపట్నం రావొద్దన్నారు. కృష్ణపట్నంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారని చెప్పారు.

ఆనందయ్య రోజుకి అయిదు వేల మందికి సరిపడే మందు తయారుచేయగలరని సంపత్‌రాజు పేర్కొన్నారు. ప్రభుత్వం జిల్లాల వారీగా లక్షల మందికి పంపిణీ చేయమనడం సరికాదని సూచించారు. ప్రాణాపాయ స్థితిలో వచ్చేవారికి మందు ఇవ్వలేక, ఆనందయ్య కన్నీళ్లు పెట్టుకుంటున్నారని తెలిపారు‌. ప్రభుత్వం సహాకారం అందిస్తేనే మందు పంపిణీ సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు. ఆన్ లైన్‌లో కూడా మందు ఇవ్వలేమని సంపత్ రాజు స్ఫష్టం చేశారు.

కాగా ఆనందయ్య మందు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. కంటి చుక్కలు తప్ప మందు పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఆన్‌లోన్ ద్వారా కూడా మందు పంపిణీ  జరుగుతుందని, ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటించిన వేళ సంపత్ రాజు చేసిన వ్యాఖ్యలు కరోనా బాధితుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. నిజంగా ఆనందయ్య మందు పంపిణీకి ప్రభుత్వం సహకరించడంలేదా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.