‘జగన్ బెయిల్ రద్దయ్యే అవకాశాలున్నాయి’

తిరుపతి: సీఎం జగన్‌ బెయిల్ (Jagan Bail) రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయని సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్ సీఎం.. కేంద్రాన్ని విమర్శిస్తూ లేఖ రాస్తే సీఎం జగన్ ఎందుకు కేంద్రానికి మద్దతుగా మాట్లాడారని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు ఎందుకు కేంద్రానికి వ్యతిరేకంగా జగన్ బలం కూడగడుతున్నారని వ్యాఖ్యానించారు. కేంద్రం‌పై వ్యతిరేకంగా లేఖ రాస్తే బెయిల్ రద్దయినా సానుభూతి పొందొచ్చునని ఆలోచనలా ఉందన్నారు. అందుకే జగన్ కోవిడ్‌ని కవచంలా వాడుకుంటున్నారని నారాయణ ఆరోపించారు.

ఇక మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంపై కూడా నారాయణ స్పందించారు. ఈటల రాజేందర్ బయటకి వెళ్ళటం టీఆర్ఎస్కే నష్టమని చెప్పారు. టీఆర్ఎస్‌లో అసలైన తెలంగాణ వాదులు ఆరుగురే ఉన్నారన్నారు. ఈటల రాజేందర్ బీజేపీలోకి వెళ్తే టీఆర్ఎస్ పార్టీకే నష్టమని పేర్కొన్నారు. మరో పశ్చిమ బెంగాల్ మాదిరిగా తెలంగాణ మారకుండా కేసీఆర్ జాగ్రత్త పడాలని నారాయణ సూచించారు.

తిరుపతి సీపీఐ కార్యాలయంలో నారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 8న లక్ష ద్వీప్‌కి సంఘీభావంగా దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నామని తెలిపారు. కార్పొరేట్ శక్తులకు ఆ దీవులను కట్టబెట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. కోవిడ్ ఊసే లేని చోట ఈ రోజు కేసులు కేంద్రం తప్పులవల్ల వస్తున్నాయని చెప్పారు. వాళ్ల ఆహారపు అలవాట్లు శాసించే హక్కు కేంద్రానికి ఎక్కడిదని ప్రశ్నించారు. ప్రఫుల్ పటేల్ లక్ష దీవుల్లో అరాచకాలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. లక్షదీవుల స్థానికులకు మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉందని నారాయణ అభిప్రాయపడ్డారు.