అనంత టీడీపీలో కుమ్ములాటలు..ఆ మూడు నియోజకవర్గాల్లో ఇక కష్టమేనా

-

అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా ఇదే పరిస్థితి. అనంతపురంజిల్లాలో టీడీపీనేతల తీరు మారటం లేదు. కుమ్ములాటల నుంచి వెనక్కు తగ్గటం లేదట. టీడీపీకి మంచి పట్టున్న ఈ జిల్లాలో పార్టీ ఎంత కష్టకాలంలో ఉన్నా ఇక్కడ టీడీపీ క్యాడర్ చెక్కు చెదరదనే టాక్ ఇంతకాలం ఉంది. కానీ నాయకుల ఆదిపత్యపోరుతో మూడు నియోజకవర్గాల్లో పరిస్థితి గందరగోళంగా తయారయింది.

అనంతపురం జిల్లా టీడీపీకి మంచి పట్టున్న ప్రాంతం. కానీ ఎన్నికల సమయం నుంచి మూడు నియోజకవర్గాల్లో జరుగుతున్న సంఘటనలు టీడీపీ కేడర్ ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. కళ్యాణదుర్గం, అనంతపురం, శింగనమల. ఈ మూడు నియోజకవర్గాల్లో ఆధిపత్యపోరు పీక్స్ కి చేరింది. అధికారంలో ఉన్నప్పుడు అదే పరిస్థితి. ఇప్పుడు విపక్షంలో ఉన్నా అదే పరిస్థితి ఇక్కడ నాయకుల తీరు మాత్రం మారలేదు.

కళ్యాణదుర్గంలో సీనియర్ నేత ఉన్నం హనుమంతరాయచౌదరి, ఉమామహేశ్వరరావుల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. గత ఎన్నికల్లో పార్టీ టికెట్ విషయంలో వీరి మధ్య ఫైట్ షురూ అయింది. ఉన్నం ఆయన కుమారుల తీరుతో పార్టీ టికెట్ ఉమాకు వెళ్లింది. దీంతో ఉన్నం అసమ్మతి రాగం గట్టిగా వినిపిస్తూ వచ్చారు. అక్కడ పార్టీ ఓడిపోయినా.. వీరి మధ్య పోరు మాత్రం ఆగలేదు. దాదాపు ఏడాదిన్నరగా వీరి మధ్య సయోధ్య కుదర్చడానికి పార్టీ పెద్దలు చేయని ప్రయత్నాలు లేవు. కాని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఒక్కోసారి బహిరంగంగానే ఘర్షణకు దిగుతున్నారు.

ఇక టీడీపీ విబేధాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న మరో నియోజకవర్గం శింగనమల ఇక్కడ కూడా సేమ్ సీన్. గత ఎన్నికల్లో పార్టీ టికెట్ కోసం శమంతకమణి కూతురు యామినీబాల బండారు శ్రావణికి టికెట్ విషయంలో పోటీ ఏర్పడింది. అయితే యామినీబాల మీద ఉన్న వ్యతిరేకత కారణంగా పార్టీ శ్రావణికి టికెట్ ఇచ్చిది. అయితే ఓటమి మాత్రం తప్పలేదు. ఎన్నికలు ముగిశాక కూడా వీరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ శమంతకమణి వైసీపీలోకి వెళ్లడంతో శింగనమల టీడీపీకి కాస్త రిలీఫ్ కనిపిస్తుంది. అంతలోనే ఎం.ఎస్.రాజు రూపంలో మరో వర్గం బయలుదేరింది. టీడీపీ రాష్ట్ర సెల్ అధ్యక్షుడు ఎం.ఎస్.రాజు శింగనమలలో పట్టు సాధించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. పార్టీ ఏ పిలుపునిచ్చినా శ్రావణిది ఒక లైన్ అయితే.. రాజుది మరో లైన్ గా మారింది.

ఇక అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మాజీ ఎంపీ జేసీ ఫ్యామిలీ మధ్య తీవ్ర స్థాయిలో వార్ నడుస్తోంది. వాస్తవంగా వీరి మధ్య పోరు ఈ నాటిది కాదు. జెసి దివాకర్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుంచి ఉన్నదే. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినా వారి మధ్య విభేదాలు అలాగే ఉన్నాయి. తాజాగా పార్లమెంట్ ఇన్ ఛార్జిగా జేసీ తనయుడు పవన్ కుమార్ రెడ్డి ఆత్మీయ సమావేశాల పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తుండటం వివాదాలకు తెరలేపింది. ఆత్మీయ సమావేశాలు నియోజకవర్గ ఇంఛార్జ్ తో సంబంధం లేకుండా నిర్వహిస్తుడడంతో ప్రభాకర్ చౌదరి వర్గం భగ్గుమంటోంది. దీనిపై ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధమవుతున్నట్లు చెప్పకుంటున్నారు. అయితే దీనిపై జేసీ పవన్ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. తనకు పార్లమెంట్ నియోజకవర్గం అంతా పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని నారా లోకేష్ చెప్పారని..ఇందులో భాగంగానే అనంతపురంతో పాటు అన్ని చోట్ల తిరుగుతున్నానని చెప్తున్నారు. ఈ పరిణామాలతో అనంతపురంలో సీన్ హాట్ హాట్ గా మారింది…

అసలే పార్టీ పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఈ సమయంలో నేతల మధ్య విబేధాలు పార్టీని మరింత కుంగదీస్తున్నాయి. లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఈ విభేదాలకు అధినేత చెక్ పెట్టే ప్రయత్నం చేయాల్సిన పరిస్థతి ఏర్పడింది. లేకపోతే వైసీపీకి అడ్వాంటేజ్ గా మారుతుందనే టాక్ టీడీపీ శ్రేణుల్లో ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version