పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఓ యువతి పెట్టిన కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తన మీద 139 మంది 5000 వేల సార్లు తనను రేప్ చేశారని బయటకు వచ్చి ఫిర్యాదు చేసింది. ఇందులో యాంకర్ ప్రదీప్ సహా నటుడు కృష్ణుడు, మరికొందరు రాజకీయ నాయకుల పీఏల పేర్లు ఉన్నాయి. దీంతో ప్రదీప్ ఈ విషయం మీద యూట్యూబ్ వేదికగా ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఈ విషయం గురించి ప్రదీప్ మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఈ విషయానికి తనకి ఏ మాత్రం సంబంధం లేదన్న అయన అసలు ఇలాంటి సెన్సిటివ్ మ్యాటర్ లో ఇతని పేరు ఎందుకు ఉందని ఆలోచించ కుండా యాంకర్ ప్రదీప్ అనగానే టపా టపా రాసేసి, సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేశారని అన్నారు.
అవతలి వాళ్ళు అసలు ఏ ఉద్దేశ్యంతో చెప్పారు.. ఎందుకు చెప్పారు.. అనేది ఏది ఆలోచించకుండా పేరు వినపడగానే ట్రోల్ చేయడం, వార్తలు రాయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించాడు. అలానే తనని ఇలా వేధిస్తూ మానసికంగా మానభంగం చేస్తున్నారని ఆయన పేర్కొన్నాడు. ఆ అమ్మాయికి ఏమి జరిగిందో మా కుటుంబంలో ఆడవాళ్ళకి కూడా అలానే చేస్తామని అనడం ఎంత దారుణమని ప్రదీప్ ప్రశ్నించాడు. తన మీద జరుగుతోన్న ట్రోల్స్ విషయంలో తన కుటుంబ సభ్యులు ఎంతో ఆవేదనకు గురవుతున్నారు. వాళ్లకు ఏమైనా జరిగితే.. ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రశ్నించారు. గతంలో కూడా నటుడు ప్రదీప్ చనిపోతే తను చనిపోయానని ప్రచారం చేశారని, కాలుకు సర్జరీ జరిగితే అంతులేని రోగం ఉన్నట్టు పుకార్లు పుట్టించారని అన్నాడు. ఇక ఫైనల్ గా ఈ విషయంలో తన మీద కామెంట్స్ చేసిన వారిని లీగల్ గానే ఎదుర్కొంటానని ఆయన పేర్కొన్నాడు.