ర్యాపిడ్ టెస్ట్ కిట్స్: జగన్ ఇమేజ్ పెరిగిందా.. తగ్గిందా?

-

అవినీతిరహిత పాలన అందిస్తామని, వీలైనంత పారదర్శకంగా పరిపాలిస్తామని ఎన్నికల సమయంలోనూ, అధికారం చేపట్టిన అనంతరమూ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే రివర్స్ టెండరింగ్ అనే ప్రక్రియ చేపట్టి వేల కోట్ల ప్రభుత్వ ధనాన్ని సేవ్ చేశారనే ప్రశంస సంపాదించుకున్నారు. ఇంతలోనే ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ కొనుగోలు వ్యవహారం ఒక్కరోజులో ఏపీ రాజకీయాల్లో కీలక అంశంగా మారిపోయింది! అధికారం చేపట్టినప్పటినుంచీ ఎటువంటి అవినీతి ఆరోపణలు లేకుండా వీలైనంత పారదర్శకంగా పాలిస్తున్న జగన్ కు తాజాగా ఒక భారీ మచ్చ అంటుకుందనే వార్తలు హల్ చల్ చేశాయి. ఇదే అదనుగా వెనకా ముందూ చూడకుండా… అదిగో పులి అంటే, ఇదిగో తోక అన్నవిధంగా ప్రతిపక్షాలు విరుచుకుపడిపోయాయి. ఈ సమయంలో జగన్ ఇచ్చిన ఆర్డర్.. చెప్పిన వివరణ.. జగన్ ఇమేజ్ పెంచిందా… తగ్గించిందా అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది!

విషయానికొస్తే… దక్షిణ కొరియాకు చెందిన సంస్థ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాపిడ్ టెస్ట్ కిట్లు కొనుగోలు చేసింది. దీంతో.. హైదరాబాద్ లోని సండూర్ మెడిక్ ఎయిడ్స్ అనే సంస్థ ద్వారా ఈ కిట్లు సరఫరా అయ్యాయి. అయితే ఈ కొనుగోలు విషయంలో భారీ స్కాం జరిగిందని తాజాగా ఆరోపణలు వచ్చాయి. దక్షిణ కొరియా దేశానికి చెందిన ఈ కంపెనీకి ఒక్కో రాపిడ్ టెస్టింగ్ కిట్ ను రూ.337 చత్తీస్ గఢ్ ప్రభుత్వం చెల్లిస్తే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకంగా రూ. 730 ధరకు రెండు లక్షల కిట్లను కొనుగోలు చేసిందని ఇందులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి.

సరిగ్గా ఇదే సమయంలో… ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమయస్ఫూర్తితో వ్యవహరించి.. ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఇన్ ఫ్రాస్ట్రక్షర్ కార్పొరేషన్ ద్వారా సదరు సండూర్ సంస్థకు నోటీసులు ఇచ్చి ఇతర రాష్ట్రాలు చెల్లించిన ధర మాత్రమే తాము ఇస్తామని తేల్చిచెప్పారు. ఇదే సమయంలో… చాలా నిజాయితీగా ర్యాపిడ్ టెస్ట్ కిట్ల కొనుగోలు జరిగిందని, తాము ఈ కిట్ లు ఆర్డర్ ఇచ్చిన సమయంలో ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లు కేంద్రం ఇవ్వలేని పరిస్థితి ఉందని… అదేవిదంగా ఐసీఎంఆర్‌ అనుమతి ఉన్న కంపెనీకే ఆర్డర్‌ ఇచ్చామని, దీంతో ఒక్కో కిట్‌ను ఐసీఎంఆరే రూ.795కి ఆర్డర్‌ ఇస్తే.. ఏపీ ప్రభుత్వం రూ.65 తక్కువగా ఆర్డర్‌ ఇచ్చిందని వివరణ ఇచ్చారు. ఇదే సందర్భంలో… ఏ రాష్ట్రానికైనా తక్కువకు అమ్మితే గనక ఏపీకి అదే ధర వర్తింపజేయాలనే షరతును ఆర్డర్‌ ఇచ్చేటప్పుడు పెట్టామని… ఇప్పటివరకు 25శాతం మాత్రమే పేమెంట్‌ ఇచ్చామని క్లారిటీ ఇచ్చారు.

ఇలా అన్ని వర్గాలు, ప్రతిపక్షాలు ఆరోపణలు చేసిన సమయంలో… ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న ఈ కీలక నిర్ణయం, ఇచ్చిన వివరణతో జగన్ ఇమేజ్ మరింత పెరిగిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు!

Read more RELATED
Recommended to you

Latest news