ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో కరోనా వ్యాప్తి గురించి తెలుసుకునేందుకు సీరో-సర్వేలెన్స్ చేపట్టనుంది. ఆ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా నిత్యం భారీ మొత్తంలో కరోనా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని విజయవాడ అర్బన్ మండలంలో మొత్తం 6 వార్డుల్లో సీరో-సర్వేలెన్స్ చేపట్టనున్నారు. దీని వల్ల కరోనా వ్యాప్తి గురించిన వివరాలు తెలుస్తాయి.
ఢిల్లీలో ఇటీవలే సీరో-సర్వేలెన్స్ చేపట్టారు. దీని వల్ల అక్కడ సుమారుగా 15 నుంచి 20 శాతం మందికి కరోనా ఉందని, వారిలో కొందరు కరోనా పట్ల రోగ నిరోధకతను కలిగి ఉన్నారని తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వ్యక్తుల నుంచి సేకరించిన శాంపిల్స్‌ను పరీక్షిస్తారు. వారిలో కరోనా యాంటీ బాడీలు ఉన్నాయో, లేదో గుర్తిస్తారు. దీని వల్ల వారు కరోనా బారిన పడ్డారో, లేదో తెలుస్తుంది. అలాగే కరోనా పట్ల వారు రోగ నిరోధకతను కలిగి ఉన్నారో, లేదో అనే విషయాలు తెలుస్తాయి. దీంతో కోవిడ్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు తగిన చర్యలను తీసుకోవడంతోపాటు టెస్టింగ్‌ను మరింత పకడ్బందీగా చేపట్టేందుకు వీలు కలుగుతుంది. ఢిల్లీలో ఈ విధానం అనుసరించాకే ప్రస్తుతం అక్కడ కేసుల సంఖ్య తగ్గుతోంది. దీంతో ఏపీలో ఇదే కార్యక్రమం చేపట్టడం ద్వారా కోవిడ్ పరిస్థితిని అంచనా వేయవచ్చని, తద్వారా తగిన చర్యలను తీసుకోవచ్చని, దాంతో కోవిడ్ వ్యాప్తిని అరికట్టవచ్చని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.
ఇక విజయవాడ మండల పరిధిలో మొత్తం 6 వార్డుల్లో శాంపిళ్లను సేకరిస్తారు. ఒక్కో వార్డు నుంచి మొత్తం 600 శాంపిళ్లను తీసుకుంటారు. మొత్తం కలిపి 3600 శాంపిళ్లను తీసుకుంటారు. ఒక్కో వార్డులో సాధారణ వ్యక్తుల నుంచి 400 శాంపిల్స్‌ను, హై రిస్క్ కేటగిరికి చెందిన 200 మంది నుంచి శాంపిల్స్‌ను.. మొత్తం 600 శాంపిల్స్‌ను సేకరిస్తారు.