ఏపీ రాజకీయం అంతా రాజధాని చుట్టూ తిరుగుతోంది. అందులోనూ క్యాపిటల్ వర్సెస్ క్యాస్ట్ కీలక అంశంగా మారుతోంది. అసలు ఏపీ రాజధాని మార్పుపై ప్రభుత్వం మనసులో ఏముందో తెలియదుగానీ.. మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణానదికి వరద పోటెత్తిన నేపథ్యంలో.. రాజధానికి ఈ ప్రాంతం అనువైనదికాదని ఆయన చేసిన వ్యాఖ్యలతో మొదలైన రాద్ధాంతం.. రోజురోజుకూ ముదురుతోంది. మంత్రి బొత్స అక్కడితోనే ఆగకుండా.. రాజధాని ప్రాంతంలో ఒకే సామాజికవర్గానికి చెందిన వారికే భూములు ఉన్నాయని, వారే భూమలు కొన్నారని కూడా చెప్పడం గమనార్హం. దీంతో వైసీపీ ప్రభుత్వం రాజధానికి తరలించే యోచనలో ఉందనే టాక్ బలంగా ప్రజల్లోకి వెళ్లింది.
అయితే.. ముఖ్యమంత్రి జగన్ అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు మంత్రి బొత్స ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేగాకుండా.. తన వ్యాఖ్యలకు కట్టుబడి కూడా ఉన్నానని చెప్పారు. అయితే.. రాజధానిలో ఒకే సామాజికవర్గానికి భూములు ఉన్నాయని మంత్రి బొత్స ఆరోపించడంలో ఆంతర్యం ఏమిటన్నది మాత్రం ఎవ్వరికీ అంతుచిక్కడం లేదు. క్యాస్ట్‌ను ముందుకు తీసుకొచ్చి.. రాజధానిని తరలించడానికి అనువైన పరిస్థితులను కల్పించడానికే మంత్రి బొత్స ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారనే టాక్ కూడా బలంగా వినిపిస్తోంది.
రాజధానిలో ఒకే సామాజికవర్గానికి భూములు ఉండడం వల్ల మిగతావర్గాలకు ఒరిగేది ఏమీలేదనే భావనను ప్రజల్లో కల్పించి.. రాజధానికి తరలింపునకు వారి నుంచి సానుకూల స్పందన పొందాలన్నదే వైసీపీ ప్రభుత్వ ఎత్తుగడగా ఉండొచ్చునని పలువురు నాయకులు అంటున్నారు. నిజానికి.. ఏపీ రాజకీయల్లో కుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అవకాశాలు, పదవులు, పదోన్నతులు..ఇలా ఏం చూసినా.. కుల ప్రభావం కనిపిస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాలో ఒక సామాజికవర్గానికి ఆస్తులు, ఆర్థిక బలం ఎక్కువగా ఉంటే.. ఉభయగోదావరిలో మరొక సామాజికవర్గానికి, రాయలసీమలో ఇంకో సామాజికవర్గం బలంగా ఉంటుంది. ఇక ఉత్తరాంధ్రలో పరిస్థితులు మరోలా ఉంటాయి.
ఏది ఏమైనా.. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే రాజధాని అమరావతి నిర్మాణం మొదలైంది కాబట్టి.. చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారే భూములు కొన్నారని, వారిదే అగ్రభాగమని మంత్రి బొత్స చెప్పకనే చెప్పారు. ఇప్పుడే దానినే సాకుగా చూపి.. ప్రజల స్పందన తెలుసుకునేందుకే వైసీపీ ప్రభుత్వం ఇలా లీకులు ఇస్తోందని, అందుకే ముఖ్యమంత్రి జగన్ కూడా స్పందించడం లేదనే టాక్ కూడా వినిపిస్తోంది.
నిజానికి.. అమెరికా నుంచి రావగానే.. ముఖ్యమంత్రి జగన్ స్పందిస్తారని, రాజధానిపై జరుగుతున్న రాద్ధాంతంపై స్పందిస్తారని అందరూ అనుకున్నారు. కానీ.. ఆయన అమెరికా నుంచి తిరిగొచ్చి ఇన్ని రోజులు అవుతున్నా మాటకూడా మాట్లాడలేదు. ఇక మరోవైపు.. బీజేపీ, వామపక్షలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్కటవుతున్నాయి. రాజధానిని తరలిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చిచెబుతున్నాయి. ఈ పరిణామాలపై వైసీపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.