ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున వాలంటీర్లతో పింఛన్ నగదు పంపిణీ చేయొద్దని ఎన్నికల సంఘం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో పింఛన్దారుల్లో ఆందోళన నెలకొంది. ఏప్రిల్, మే, జూన్ నెలలో తమకు పింఛన్ నగదు అందదేమోననే అనుమానం వ్యక్తమవుతోంది. దీంతో పింఛన్దారులకు ప్రతి నెల మాదిరిగా కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో నగదును అందించాలని కోరుతున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు సైతం పింఛన్ పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా ఏప్రిల్ 1, 2024 సోమవారం రోజు పెన్షన్లు అందేలా చూడాలని కోరారు. ‘లబ్దిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా డోర్ టు డోర్ విధానంలో పెన్షన్లు అందించే విధంగా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ఖజానాలో నిధులు లేని కారణంగా పెన్షన్ల పంపిణీ నిలిచిపోకూడదు. ప్రభుత్వం వెంటనే అవసరమైన నిధులు కేటాయించి పెన్షన్లు పంపిణీ పూర్తి చేయాలి.’ అని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.