ఫైన‌ల్ లిస్ట్‌పై భ‌గ్గుమ‌న్న టీడీపీ శ్రేణులు.. కార్యాల‌యాల‌పై దాడులు

-

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విడుద‌ల చేసిన నాలుగో జాబితాపై ఆ పార్టీ శ్రేణులు భ‌గ్గుమ‌న్నాయి. అభ్య‌ర్దుల ప్ర‌క‌ట‌న‌తో ఏపీ వ్యాప్తంగా ప‌లుచోట్ల ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ముఖ్యంగా విజ‌య‌న‌గ‌రం జిల్లాలో తుది జాబితాపై నిర‌స‌న‌లు మిన్నంటాయి. చీపురుప‌ల్లి టికెట్ ను క‌ళా వెంక‌ట్రావ్‌కు కేటాయించ‌డంతో పార్లమెంట్ నియోజకవర్గం టీడీపీ అధ్యక్ష పదవికి, చీపురపల్లి ఇన్ ఛార్జ్ పదవికి కిమిడి నాగార్జున రాజీనామా చేశారు.అటు నెల్లిమర్ల ఇన్ ఛార్జ్ కర్రోతు బంగార్రాజుకి పార్టీ తీరని ద్రోహం చేసిందని పోలిపల్లిలో కార్యకర్తలు మండిప‌డ్డారు.

విజయనగరం, చీపురపల్లి టిక్కెట్టు జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జునకు కేటాయించకపోవటంతో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిర‌స‌న‌ల‌కు దిగారు. చీపురపల్లిలో టీడిపి ప్రచార సామగ్రిని దగ్ధం చేసి పార్టీ అధినేత‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు.నాలుగు మండ‌లాల‌కు చెందిన అధ్య‌క్ష ప‌ద‌వుల‌కు నేత‌లు రాజీనామాలు స‌మ‌ర్పించారు.

అనంత‌పురం అర్బ‌న్‌లో మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరిని కాదని వ్యాపార‌వేత్త‌ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్కు టికెట్ కేటాయించారు. దీంతో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.అభ్య‌ర్ధుల తుది జాబితా ప్రకటించిన అనంతరం వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఇంటి వద్దకు భారీగా తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు చేరుకుని పెద్ద ఎత్తున చంద్రబాబుని, నారా లోకేష్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. మరోవైపు నగరంలోని జిల్లా తెలుగుదేశం కార్యాలయంపై కూడా దాడికి పాల్ప‌డ్డారు.టీడీపీ ఆఫీసుపై దాడిలో కార్యాలయం గేట్లు బండరాయితో పగలగొట్టి లోపల ఉన్న ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. అనంతరం కార్యాలయంలోని రికార్డులను ఫర్నిచర్ ను కార్యాలయం ఎదురుగా వేసి నిప్పట్టించారు.

దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, మాజీ సీఎం చంద్రబాబు ఉన్న పార్టీ కార్యాలయం హోర్డింగ్ ను సైతం అదే మంటలలో వేసి తగలబెట్టారు. మరోవైపు పార్టీ జిల్లా అధ్యక్షుడు కాలువ శ్రీనివాసులు ఇంటి వద్దకు పెద్ద ఎత్తున అర్బన్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేరుకొని నిరసనను వ్యక్తం చేశారు.టీడీపీ శ్రేణుల నిర‌స‌న‌ల‌తో అనంత‌పురం అట్టుడుకుతోంది.పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి ఎన్నో కేసులు పెట్టించుకుని ధైర్యంగా నిలబడిన వారికి కాకుండా కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఎలా కేటాయిస్తారని వైకుంఠం ప్రభాకర్ చౌదరి ప్రశ్నించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కార్యకర్తలపై తమపై ఎన్నో కేసులు బనాయించిన ధైర్యంగా నిలబడి ఎదుర్కొన్నందుకు చంద్రబాబు నాయుడు ఈ విధంగా వ్యవహరించడం సరైనది కాదన్నారు. రాజ‌కీయ భవిష్యత్తుపై త్వ‌ర‌లోనే కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తామ‌ని వారు స్ప‌ష్టం చేశారు.

గుంతకల్లు నియోజకవర్గంలోనూ టీడీపీ కార్య‌క‌ర్త‌లు నిర‌స‌న‌ల‌కు దిగారు. టీడీపీ ఇంచార్జ్ జితేంద్ర గౌడ్ ని కాదని వైసీపీ నుంచి వచ్చిన మంత్రి గుమ్మనూరు జయరాం కు టిడిపి అధినేత టికెట్ కేటాయించారు. దీంతో గుంతకల్లు నియోజకవర్గంలో ఒకసారి గా తెలుగుదేశం పార్టీ వర్గీయులు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. గతంలో నారా చంద్రబాబు నాయుడుని లోకేష్ ను ఇష్టం వచ్చినట్లుగా దూషించిన వ్యక్తికి పార్టీలోకి వచ్చిన వెంటనే టికెట్ కేటాయించడం ఏంటని ప్రశ్నించారు.

టికెట్‌పై బోలెడ‌న్ని ఆశ‌లు పెట్టుకున్న కావ‌లి మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి సైతం పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా స‌మ‌ర్పించారు. చంద్ర‌బాబు న‌మ్మించి మోసం చేశార‌ని ఆయ‌న వ‌ర్గీయులు తీవ్ర అసంతృప్తిని వెళ్ళ‌గ‌క్కారు. ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ కూట‌మి అభ్య‌ర్ధుల‌ను ఖ‌చ్చితంగా ఓడిస్తామ‌ని స‌హాయ నిరాక‌ర‌ణ త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు. ఇంకా కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో కార్య‌క‌ర్త‌లు నిర‌స‌న‌ల‌కు దిగుతుండ‌గా కొంద‌రు నేత‌లు పార్టీని వీడేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. మొత్తానికి టీడీపీ ఫైన‌ల్ జాబితా ఆ పార్టీ శ్రేణుల్లో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది,.

Read more RELATED
Recommended to you

Latest news