టిడిపి అధినేత చంద్రబాబుకు 2024 ఎన్నికలే చివరి ఎన్నికలని జోష్యం చెప్పారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి. చంద్రబాబుకు వయసు అయిపోయిందని.. ఇప్పటికైనా ఆయన మారాలని సూచించారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఆయన రాష్ట్ర ప్రజలు మూడు రాజధానులను కోరుకుంటున్నారని చెప్పారు. కానీ చంద్రబాబు మాత్రం అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తున్నారని విమర్శించారు.
అదే సమయంలో అమరావతి ప్రాంత రైతుల పాదయాత్రను తప్పుపట్టారు. చంద్రబాబు తెరవెనక ఉండి దీన్ని నడిపిస్తున్నారని విమర్శించారు. 29 గ్రామాల ప్రజలు మాత్రమే బాగుపడాలని చంద్రబాబు కోరుకుంటున్నారని నారాయణస్వామి ధ్వజమెత్తారు. సీఎం జగన్ సారధ్యంలో తమ ప్రభుత్వం అన్ని ప్రాంతాలను సమంగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తోందన్నారు. ఇందులో భాగంగానే మూడు రాజధానుల విధానాన్ని తెరమీదకి తీసుకొచ్చారని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల లబ్ధిని నేరుగా ప్రజలకు అందజేస్తున్నారని గుర్తు చేశారు. తన బినామీలను కాపాడుకోవడానికి అమరావతిని రాజధానిగా కొనసాగించాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారని అన్నారు.