వరద బాధితులకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. 25 కేజీల బియ్యం, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళాదుంపలు, కేజీ పామాయిల్, కేజీ కందిపప్పు ఇవ్వాలని ఆదేశించారు సీఎం జగన్. ఏపీలో వర్షాలు, నదుల్లో వరద ప్రవాహం, సహాయ పునరావాసం కార్యక్రమాలపై సీఎం జగన్ సమీక్షించారు. వరద ప్రభావం ఉన్న ప్రాంతాల్లో సహాయ పునరావాసం కార్యక్రమాలు అత్యంత సమర్థవంతంగా సాగాలని కలెక్టర్లను ఆదేశించారు.
అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. శుక్రవారం కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన… రాష్ట్రంలో వర్షాలు, వరదలపై సమీక్షించారు. రేపు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 53.81 అడుగులకు చేరుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోందని… ధవళేశ్వరం వద్ద కూడా వరద ప్రమవాహం సుమారు 16 లక్షలకు చేరుకునే అవకాశాలు ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారని తెలిపారు.శిబిరాల నుంచి తిరిగి తమ నివాసాలకు వెళ్లే ప్రతి కుటుంబానికి రూ.2 వేలు ఇవ్వాలని స్పష్టం చేశారు. దెబ్బతిన్న ఇళ్లకు రూ.10 వేలు చొప్పున చెల్లించాలని పేర్కొన్నారు.