ఏపీలో కురిసిన భారీ వర్షాలకు వరదలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.విజయవాడలో బుడమేరు వాగు పొంగిపొర్లడంతో కాలువకు భారీగా గండ్లు పడ్డాయి. బుడమేరు కాలువకు గండ్లు పడటం వల్లే విజయవాడను వరదలు ముంచెత్తాయని అధికారులు తేల్చారు. సుమారు నాలుగు నుంచి ఆరు వరకు గండ్లు పడినట్లు తెలుస్తోంది.తక్కువ కెపాసిటీ గల బుడమేరు కెనాల్‌లో ఏకంగా 10లక్షల క్యూసెక్కుల వరద నీరు రావడం వల్లే గండ్లు భారీగా ఏర్పడినట్లు తెలుస్తోంది.
అయితే, ఏపీలో కురిసిన భారీ వర్షాలకు 149 పశువులు, 59,848 కోళ్లు మరణించాయని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. వరదల ధాటికి 3 వేల కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని పేర్కొంది. బాధితులకు 6 హెలికాప్టర్ల ద్వారా 7,870 కేజీల ఆహార పదార్థాలను అందించినట్లు తెలిపింది. సహాయక చర్యల్లో 48 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తున్నాయని వెల్లడించింది.అంతేకాకుండా 7.49కోట్ల అలర్ట్ సందేశాలను ప్రజలకు పంపించినట్లు తెలిపింది.