టీడీపీ కేంద్ర మంత్రివర్గంలో చేరనుంది. టీడీపీ సభ్యులకు కనీసం రెండు నుంచి గరిష్ఠంగా నాలుగు క్యాబినెట్ మంత్రి పదవులు, మరో రెండు సహాయ మంత్రి పదవులు లభించే వీలుందని సమాచారం. ఈ క్రమంలో టీడీపీ నుంచి లోక్‌సభకు గెలుపొందిన వారిలో బలహీనవర్గాలకు చెందిన వారు అత్యధికంగా ఆరుగురున్నారు. వీరిలో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు, ఎస్సీ వర్గం నుంచి అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్, విశ్రాంత ఐఆర్‌ఎస్ అధికారి ప్రసాదరావు (చిత్తూరు) వైపు కొంత మొగ్గు ఉండొచ్చని టాక్. మిగిలిన రెండు ప్రధాన వర్గాల్లో గుంటూరు, నరసరావుపేటల నుంచి గెలుపొందిన పెమ్మసాని చంద్రశేఖర్, లావు శ్రీకృష్ణదేవరాయలు నుంచి ఒకరు, నెల్లూరు, నంద్యాలల నుంచి విజయం సాధించిన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బైరెడ్డి శబరిల నుంచి మరొకరిని పరిశీలించే అవకాశముంది.
ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న జనసేన నుంచి ఇద్దరు లోక్‌సభ సభ్యులుగా గెలిచారు. వారిలో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి సీనియర్. మూడోసారి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జనసేనకు అవకాశమిస్తే సహజంగానే బాలశౌరి పేరు పరిశీలనకు వస్తుంది. బీజేపీ నుంచి ముగ్గురు గెలుపొందగా వీరిలో పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలైన కేంద్ర మాజీ మంత్రి, గతంలో లోక్‌సభకు రెండుసార్లు ఎన్నికైన పురందేశ్వరి (రాజమహేంద్రవరం), రెండుసార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన సీఎం రమేష్ (అనకాపల్లి) పేర్లు పరిశీలనలో ఉంటాయి.