దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడి కావడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల కోడ్ ఎత్తివేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని 21 జిల్లాలో ఎలక్షన్ కోడ్ ఎత్తివేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో ప్రజావాణి కార్యక్రమం మళ్లీ ప్రారంభం కానుంది. మహాత్మ జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో ప్రతీ మంగళ, శుక్రవారాల్లో కొనసాగుతుందని ప్రజావాణి ఇంచార్జి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి తెలిపారు. ఇవాళ శుక్రవారం కాబట్టి ఈరోజు నుంచి పునఃప్రారంభం కానుందని వెల్లడించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజా భవన్లో ప్రజావాణి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే లోక్ సభ ఎన్నికల కోడ్ వల్ల మార్చి 16వ తేదీ నుంచి ప్రజావాణిని నిలిపివేశారు. ఎన్నికల కోడ్ ముగిసినందున నేటి నుంచి మళ్లీ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించనున్నట్లు తెలిపారు. ప్రజలు ప్రజావాణి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజావాణి రాష్ట్ర నోడల్ ఆఫీసర్గా ఐఏఎస్ అధికారి దివ్య కొనసాగుతున్నారు.