శ్రీకాళహస్తీశ్వరాలయం ఘటనలో నలుగురు ఉద్యోగుల సస్పెన్షన్

శ్రీకాళహస్తీశ్వరాలయంలో అక్రమంగా శివలింగం, నంది ప్రతిమల ప్రతిష్టాపన వివాదంలో నలుగురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. ఆలయ ఏఈవో ధనపాల్, ఆలయ ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్, ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్లు విజయ సారథి, వెంకట మునిలని సస్పెండ్ చేశారు. విచారణ కమిటీ నివేదిక ఆధారంగా ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. నలుగురు సభ్యులతో నియమించిన విచారణ కమిటీలో ప్రస్తుతం సస్పెన్షన్కు గురైన ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్ కూడా ఉండడం గమనార్హం.

శ్రీకాళహస్తి ఆలయంలో అక్రమంగా శివలింగ ప్రతిష్ట కేసులో ఆలయ మొదటి గేటు వద్ద ఉన్న రంగుల గోపురం నుంచి ముగ్గురు తమిళనాడుకు చెందిన భక్తులు విగ్రహాన్ని గోతాము సంచిలో భుజంపై మోస్తూ వెళ్లిన దృశ్యాలను సీసీ టీవీ ఫుటేజ్ లో గుర్తించారు పోలీసులు. 6 తేదీ ఉదయం 10.50 నిమిషాలకు విగ్రహంతో ఆలయంలోకి అనుమానితులు ప్రవేశించినట్టు గుర్తించిన పోలీసులు, సి.సి ఫుటేజ్ ను పూర్తిగా తమ స్వాధీనం చేసుకున్నారు. అనుమానితులు తమిళనాడు రాష్ట్రం సేలం ప్రాంతానికి చెందిన వారిగా భావించి, తమిళనాడుకి ప్రత్యేక పోలీసు బృందాలు వెళ్ళాయి.