ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్ ఫలితాలను ఈరోజు సాయంత్రం 4 గంటలకు విజయవాడలో విడుదల చేయనున్నారు. ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, ఉన్నత విద్యామండలి ఇన్‌ఛార్జి ఛైర్మన్ రామమోహన్‌రావుతో కలిసి ఫలితాలను విడుదల చేయనున్నట్లు సెట్ ఛైర్మన్, జేఎన్‌టీయూ-కాకినాడ వీసీ ప్రసాదరాజు తెలిపారు. ఈ ఏడాది ఈఏపీసెట్‌ను జేఎన్‌టీయూ- కాకినాడ నిర్వహించిన విషయం తెలిసిందే.
మొత్తం 3,62,851 మంది దరఖాస్తు చేయగా.. వారిలో 3,39,139 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇంజినీరింగ్‌కు సంబంధించి 2,58,373 మంది, వ్యవసాయ, ఫార్మసీ విభాగాలకు కలిపి 80,766 మంది పరీక్షలు రాశారు. ఈఏపీసెట్‌లో ఇంటర్మీడియట్ మార్కులకు 25% వెయిటేజీ ఉంటుంది. దీని ఆధారంగా ర్యాంకులు ప్రకటిస్తారు.
మరోవైపు తెలంగాణలో 2024-25 విద్యా సంవత్సరంలో బీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన ఎడ్‌సెట్ ఫలితాలు మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు విడుదల కానున్నాయి. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్ లింబాద్రి పరీక్ష ఫలితాలను విడుదల చేస్తారని కన్వీనర్ ఆచార్య మృణాళిని ఒక ప్రకటనలో తెలిపారు.