ఎన్నికల నేపథ్యంలో ఏపీలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి తరలిస్తున్న నగదు, మద్యం, బంగారం, ఇతర విలువైన వస్తువులను సీజ్ చేస్తున్నారు. సరైన ఆధారాలున్న వాటిని మాత్రం వదిలేస్తున్నారు.
ఈ క్రమంలో ఎన్నికల తనిఖీల్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్టు వద్ద తనిఖీలు చేపట్టిన పోలీసులు.. లారీలో తరలిస్తున్న రూ.8.40 కోట్లను సీజ్ చేశారు. నగదును హైదరాబాద్ నుంచి గుంటూరుకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఎవరైనా నిబంధనలను మించి నగదు తరలించాలంటే దానికి సరైన ఆధారాలు తప్పకుండా ఉండాల్సిందేనని తెలిపారు. ఇక ఇటీవలే ఏపీలో 4 కంటైనర్లలో భారీగా నగదు పట్టుబడిన విషయం తెలిసిందే.