జగన్ అధికారంలోకి రాగానే ప్రజా వేదిక కూల్చేశారు.. మూడు రాజధానులన్నారు.. బీసీజీ రిపోర్ట్ అన్నారు. జీఎస్ రావు కమిటీ అన్నారు. విధ్వంసానికి ఎన్ని చేయాలో.. జగన్ అన్నీ చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. ప్రజా వేదిక శిథిలాలను అలాగే ఉంచాలని సూచనలు వస్తున్నాయి. 1631 రోజుల పాటు అమరావతి కోసం రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించారని ఆయన తెలిపారు. రాష్ట్రం కోసం భూములిచ్చిన రైతులను జగన్ రోడ్డున పడేశారని.. అమరావతి ఉద్యమంలో భాగంగా ఎక్కడికి వెళ్లినా.. గత ప్రభుత్వం అడ్డుకుందన్నారు. అమరావతి రైతుల త్యాగం ఊరికేపోదు. రాజధాని నిర్మాణానికి నిధులు ఇస్తామన్నా.
జగన్ అక్కర్లేదన్నారు. సింగపూర్ కన్సార్టియంను రద్దు చేసింది గత ప్రభుత్వమేనని చంద్రబాబు చెప్పారు. మరోవైపు.. అమరావతి ప్రాజెక్టు నిర్మాణ అంచనాలు పెరిగాయని అన్నారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల నష్టం కూడా విపరీతంగా ఉందన్నారు. గంటలో రూ.2 వేల కోట్లు సమీకరించుకునేలా బాండ్ల అమ్మకాలు జరిగాయని చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతికి అద్భుతమైన రేటింగ్ ఉండేది.. కానీ ఇప్పుడు దారుణంగా దెబ్బతిందని సీఎం ఆరోపించారు. రేటింగ్ తక్కువగా ఉండడం వల్ల పెట్టుబడులు రాలేదు.. రాష్ట్రంలోని పేదలు పాచిపనులకు కూడా పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేసిందని తెలిపారు. వ్యాపారాలు దారుణంగా దెబ్బతిన్నాయి. పరిశ్రమలు వెళ్లిపోయాయి. ఉద్యోగులు, ఉపాధి లభించ లేదన్నారు. జీఎస్టీ, ఐటీ వంటి రంగాల ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోయిందని.. జగన్ ప్రభుత్వ అరాచకం వల్ల రాష్ట్రం ఘోరంగా దెబ్బతిందని తెలిపారు.