అమెరికాలో జాహ్నవి కందుల మృతిని చులకన చేస్తూ మాట్లాడిన డేనియల్ అడెరెర్ అనే పోలీసు అధికారిని ఉద్యోగంలో నుంచి తీసివేశారు. జాహ్నవి మృతిపై అడెరెర్ చేసిన వ్యాఖ్యలు ఆమె కుటుంబాన్ని తీవ్రంగా గాయపర్చాయని సియాటెల్ పోలీసు డిపార్ట్‌మెంట్ చీఫ్ సూ రహర్ తెలిపారు. వాటిని ఎవరూ మాన్పలేరని .. ఆయన మాటలు సియాటెల్ పోలీసు డిపార్ట్‌మెంట్‌కు మాయని మచ్చ తెచ్చాయని అన్నారు. ఆయన వల్ల పోలీసుల విధులు మరింత కఠినంగా మారాయని వాపోయారు.
ఏం జరిగిందంటే?
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన 23 ఏళ్ల కందుల జాహ్నవి 2023 జనవరిలో సియాటెల్‌లోని పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొని మృతి చెందింది. అయితే ఆ సమయంలో పోలీసు అధికారి డేనియల్ అడెరెర్ చులకనగా మాట్లాడుతూ పగలబడి నవ్విన వీడియో ఒకటి ఆ మధ్య వైరల్ అయ్యింది. ‘ఆమె ఓ సాధారణ వ్యక్తి.. ఈ మరణానికి విలువలేదు’ అన్నట్లు ఆయన మాట్లాడటం అప్పట్లో పెద్ద దుమారం రేపింది. ఈ క్రమంలో ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం డిమాండ్ చేసింది. దీంతో అతణ్ని అప్పట్లోనే సస్పెండ్ చేయగా తాజాగా ఆయణ్ను పూర్తిగా విధుల నుంచి తొలగించారు.