ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన సందర్భంగా వైసీపీ ప్రభుత్వం పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు చేసిన వ్యాఖ్యలపై తాజాగా వైసీపీ మంత్రి కొట్టు సత్యనారాయణ స్పందించారు. బిజెపిలో ఉన్న టిడిపి కోవర్టులు ఇచ్చిన స్క్రిప్ట్ ని అమిత్ షా, నడ్డాలు చదివేసి వెళ్లిపోయారని విమర్శించారు. పలు సందర్భాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. ముఖ్యమంత్రి జగన్ ని కొనియాడారని.. ఇప్పుడు షా, నడ్డా విరుద్ధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ఇద్దరు బీజేపీ అగ్ర నేతలు చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కొట్టు. ఈ వ్యాఖ్యలు చూశాక ప్రధాని మోదీ, అమిత్ షా ల మధ్య విభేదాలు వచ్చినట్టు అనుమానాలు కలుగుతున్నాయన్నారు. మోడీ 9 ఏళ్ల పరిపాలనపై సభలు పెట్టి.. దాని గురించి మాట్లాడలేదని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.