ఈరోజు అంతర్జాతీయ బొల్లి దినోత్సవం. అల్బినిజం అనేది పుట్టుకతో వచ్చే అరుదైన, జన్యుపరంగా సంక్రమించిన ఆరోగ్య పరిస్థితి. దీని ఫలితంగా జుట్టు, చర్మం, కళ్లలో మెలనిన్ అనేది లోపిస్తుంది. అసలు పిగ్మెంటేషన్ లేకపోవడం వలన వీరు జుట్టు నుంచి పాదాల వరకు తెల్లగా ఉంటుంది. వీరికి ప్రకాశవంతమైన సూర్యకాంతి వలన హాని కలుగుతుంది. అయితే ఇదేమి అంటువ్యాధి కాదు, ఒకరి నుంచి మరొకరికి ఏ రకంగా సోకదు. అలాగే దీనికి చికిత్స కూడా లేదు. ఈ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏటా జూన్ 13న అంతర్జాతీయ బొల్లి దినోత్సవంగా జరుపుకుంటారు.
అల్బినిజం పరిస్థితి కలిగిన వ్యక్తుల్లో మెలనిన్ లోపం ఏర్పడుతుంది. దీంతో వెంట్రుకలు మెరిసే వెండి- తెలుపులోకి మారతాయి. దేహం తెల్లగా, లేత గులాబీలో ఉంటుంది. ఇది ఏ జీవిలో అయినా సహజం. కానీ చాలా అరుదుగా సంభవించే ఒక జన్యు సమస్య. అల్బినిజం ఉన్న వ్యక్తులు శారీరకంగా, సామాజికంగా అనేక సమస్యలకు గురవుతారు. కళ్ళలో మెలనిన్ లేకపోవడం వల్ల, చాలా మందికి తరచుగా శాశ్వత దృష్టి లోపం ఏర్పడుతుంది. పిగ్మెంటేషన్ సమస్య తీవ్రంగా ఉన్న వారు చర్మ క్యాన్సర్‌కు గురయ్యే అవకాశం ఉంది. కొన్ని దేశాల్లో అల్బినిజం ఉన్నవారిలో ఎక్కువ మంది 30 – 40 సంవత్సరాలకే చర్మ క్యాన్సర్‌తో మరణిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి..
అల్బినిజం సమస్యను ఎదుర్కొంటున్న వ్యక్తులు సామాజికంగా పలు రకాల వివక్షలను ఎదుర్కొంటున్నారు. వారి ఈ పరిస్థితిపై అవగాహన కల్పించడం కోసం, వారి హక్కులను తెలియజేయడం కోసం ప్రతి సంవత్సరం జూన్ 13న ‘అంతర్జాతీయ అల్బినిజం అవగాహాన దినోత్సవం’ గా నిర్వహిస్తున్నారు.
ప్రాముఖ్యత
ఐక్యరాజ్య సమితి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అల్బినిజం ఉన్న వ్యక్తులపై దాడులు, వివక్షను నిరోధించాలని పిలుపునిస్తూ 2013లో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అల్బినిజం ఉన్నవారి భౌతిక రూపాన్ని తరచుగా హేళన చేయడం, మూఢనమ్మకాలతో అపోహలు సృష్టించడం, వీరిని సామాజిక బహిష్కరణ గురిచేయడం లాంటివి సమాజహితం కాదని, వైద్యపరంగానూ తప్పని ఐరాస హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వెల్లడించింది. ఇదొక జన్యుపరమైన సమస్య తప్పితే, వీరు కూడా అందరిలాంటి మనుషులే, వీరిని అందరితో పాటు కలుపుకోవాలి, కలిసి జీవించాలి.. వీరికి ప్రతిచోటా అందరిలాగే సమాన హక్కులు ఉంటాయని చెప్పడం కోసం ప్రపచవ్యాప్తంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం ఈరోజుకు ఉన్న ప్రాముఖ్యతను తెలుపుతుంది.
ఈ ఏడాది థీమ్
ఈ ఏడాది అల్బినిజం దినోత్సవం థీమ్ “Inclusion is strength.” ఈ వ్యాధి ద్వారా ప్రభావితమైన అందరిని మనలో ఒకరిగా చేర్చుకుంటేనే వారు మానసికంగా బలంగా ఉంటారు, వారిని దూరంపెట్టి అంటువ్యాధిలా భావించొద్దు అనేదే ఈ థీమ్ ఉద్దేశం.