బండి సంజయ్ – కవిత మధ్య ట్వీట్ వార్..!

-

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ బండి సంజయ్ ఉదయం ట్విట్ చేశారు. దీనికి కవిత అంతే ఘాటుగా రీట్వీట్ చేశారు. ఉదయం బండి సంజయ్ ట్విట్ చేస్తూ.. ” గవర్నర్ కు గౌరవం దక్కదు, ఆడబిడ్డలకు లేదు అండ, గిరిజన మహిళలపై పోలీస్ గిరి, బతుకమ్మను అవమానించిన వాడితో ఆలింగనం, ఇంటి బిడ్డకు మాత్రం బలగంతో నిలబడతావు అడ్డం, అదిరింది కేసీఆర్.. నీ మహిళా సంక్షేమం” అని ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు బండి సంజయ్.

దీనికి కవిత కౌంటర్ క్విట్ చేస్తూ.. ” పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంలో గిరిజన మహిళా రాష్ట్రపతికి గౌరవం దక్కదు, మహిళా రెజ్లర్లు ధర్నా చేస్తున్న తప్పు చేసిన బిజెపి ఎంపీ పై చర్యలు ఉండవు, నినాదాలకే పరిమితమైన భేటీ బచావో.. బేటి పడావో.. సిలిండర్ ధరలు విపరీతంగా పెంచి మహిళలకు కన్నీరు తెప్పిస్తున్న దుస్థితి.. మహిళా విద్యా, వైద్యం పై పూర్తి నిర్లక్ష్యం.. ఆడబిడ్డల సంక్షేమం కంటే కొందరి అభివృద్ధి ముఖ్యం.. ఆడబిడ్డ తలుచుకుంది.. ఇక మీ అడ్రస్ గల్లంతవుతుంది” అని కవిత ట్విట్ చేశారు.

ఈ ట్వీట్ కి కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్. “సొంత పార్టీలో మహిళా నేతలపైనే అకృత్యాలకు పాల్పడే గులాబీ కీచకులపై మౌనం, ఆడబిడ్డలను వేధించి పీడించి ప్రాణాలు తీసుకునే స్థితికి చేరినా ఆ నేతలపై చర్యలు శూన్యం, పోడు భూముల కోసం పోరుబాట పట్టిన ఆడబిడ్డల చేతికి సంకెళ్ళేసిన వైనం, పసి బిడ్డ నుండి పండు ముసలి వరకూ ఎవరికీ లేని రక్షణ, తొలి క్యాబినెట్లో కనీసం ఒక్క మహిళలకూ దక్కని ప్రాతినిధ్యం, పాయఖానాలు సైతం లేక ఆడకూతుర్లు అవస్థలు పడుతుంటే స్పందించని నిర్లక్ష్యం, డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో దగా చేసి మహిళల్ని గోస పెడుతూ అలసత్వం, బాలింతలు మృతి చెందినా పరామర్శించని కర్కశత్వం, రాజకీయాల కోసం మహిళా బిల్లంటూ వీధులకు ఎక్కి నాటకాలు చేస్తున్న తీరుని తెలంగాణ మహిళలోకం ఏనాడో పసిగట్టింది.. గులాబీ పార్టీ పని పడుతుంది” అని కౌంటర్ ఇచ్చారు బండి.

Read more RELATED
Recommended to you

Latest news