ఇంటర్మీడియట్ విద్యార్థులకు అలర్ట్. ఇవాళ ఏపీలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పబ్లిక్ పరీక్షల ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రకటించింది. తాడేపల్లిలోని ఇంటర్మీడియట్ విద్యా కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈనెల 4వ తేదీ నాటికి జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేశారు. ప్రథమ సంవత్సరానికి సంబంధించి 5,17,617, ద్వితీయ సంవత్సరం 5,35,056 మంది పరీక్ష ఫీజు చెల్లించగా.. వీరిలో 9,99,698 మంది పరీక్షలకు హాజరయ్యారు.
పరీక్షల ఫలితాల నేపథ్యంలో అధికారులు విద్యార్థులకు, తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు. పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని విద్యార్థులను తల్లిదండ్రులు మందలించకూడదని, అలాగే విద్యార్థులు కూడా నిరాశ చెందకూడదని చెప్పారు. ఒకవేళ పరీక్షల్లో ఫెయిల్ అయితే మళ్లీ రాసే అవకాశం ఉంటుంది కనుక ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. అంతేగానీ పరీక్షలో ఫెయిల్ అయినందుకు, తక్కువ మార్కులు వచ్చాయని కఠిన నిర్ణయాలు తీసుకోకూడదని సూచించారు. తల్లిదండ్రులు కూడా ఫలితాలు వచ్చాక విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వివరించారు.