ఏపీలో అల్పపీడన ప్రభావంతో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నవిషయం తెలిసిందే. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించడంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వర్ష ప్రభావం తీవ్రంగా ఉన్న ఆయా జిల్లాల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో అధికారులు అన్నివేళలా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీచేశారు. వర్ష ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ముందస్తుగా సహాయక చర్యలు చేపట్టాలని, తీర ప్రాంత ప్రజలకు ముందస్తుగా హెచ్చరికలు జారీచేయాలన్నారు.
అదే విధంగా కుండపోతగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని సూచించారు. వర్షాలపై ఎప్పటికప్పడు ప్రజలకు అలర్ట్ మెసేజ్ లు పంపించాలని, మ్యాన్ హోల్స్ వద్ద జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వాగులు, వంకల పొంగిపొర్లే సమయంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, మైకుల ద్వారా అనౌన్స్ మెంట్ చేయించాలని అధికారులను ఆదేశించారు. ఎటువంటి ప్రమాదాలు చోటచేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, సహాయక బృందాలను సైతం రంగంలోకి దించాలని అధికారులను అప్రమత్తం చేశారు.