అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయ దహనం కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ ఘటనపై నిగ్గు తేల్చాలని ప్రభుత్వం భావిస్తున్న వేళ.. సర్కార్ ఆదేశాల మేరకు అధికారులు దర్యాప్తులో వేగం పెంచారు. ఈ క్రమంలోనే ఏపీ సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ ఇవాళ మదనపల్లెకు చేరుకున్నారు. సబ్ కలెక్టరేట్ కార్యాలయాన్ని పరిశీలించిన ఆయన .. కేసు పురోగతిపై సమీక్షిస్తున్నారు.
అసలేం జరిగిందంటే? మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని కొందరు దుండగులు ఈనెల 21వ తేదీన ఆదివారం రాత్రి 11.24 గంటలకు తగలబెట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కీలక కంప్యూటర్లు, దస్త్రాలన్నీ కాలి బూడిదయ్యాయి. ఘటన జరిగే కొన్ని నిమిషాల ముందు వరకు కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ గౌతమ్‌తో పాటు పలువురు సిబ్బంది అక్కడ ఉన్నారు. ఈ నేపథ్యంలో కావాలనే ఎవరో ఈ కుట్ర పన్నారని భావిస్తున్న ప్రభుత్వం.. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది. ఈ క్రమంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సబ్ కలెక్టర్ కార్యాలయంలో పని చేసే ఆర్డీవో హరిప్రసాద్‌తో పాటు 37 మంది సిబ్బందిని, పూర్వ ఆర్డీవో మురళిని అదుపులో ఉంచుకుని విచారిస్తున్నారు.