రాజకీయ నాయకుల మాటలకు అర్థాలు పరమార్థాలు తెలుసుకోవాలంటే అది సామాన్యులకు కుదరని పని. సమయానుకూలంగా మాట్లాడటం రాజకీయనాయకులకి వెన్నతో పెట్టిన విద్య. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే, ఏపీలో అధికార పార్టీ వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మధ్య రాజకీయ యుద్ధం పెద్ద గానే జరుగుతోంది. ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రయత్నాలు చేస్తుండగా, వైసీపీ ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేదని, కరోనా వైరస్ ప్రభావం ఇంత తీవ్రంగా ఉన్న సమయంలో ఇంత అకస్మాత్తుగా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏమిటంటూ గట్టిగా ప్రశ్స్తోంది.
అయితే ఈ వైరస్ ప్రభావం పెద్దగా లేదని, మిగతా రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని , కాబట్టి ఇక్కడ కూడా ఎన్నికలు నిర్వహించాలంటూ టిడిపి ఎన్నికల కమిషనర్ నిర్ణయానికి మద్దతు పలుకుతోంది. ఈ సంగతి ఇలా ఉంటే, కొద్ది రోజుల క్రితమే ఏపీలో అన్ని పాఠశాలలు యధావిధిగా ప్రారంభమయ్యాయి. అక్కడక్కడ కరోనా కేసులు బయట పడుతుండడంతో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది.కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో పాఠశాలలు ఏ విధంగా తెరుస్తున్నారు అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది.
అయితే ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో వెనకడుగు వేయడానికి ఇష్టపడటం లేదు. అసలు ఎప్పుడో ఆగస్టు నుంచి పాఠశాలను తెరవాలని జగన్ చూసినా , అది సాధ్యం కాలేదు కానీ, ఇప్పుడు మాత్రం వెనకడుగు వేసేందుకు ఇష్టపడడం లేదు. ఈ రెండు పార్టీలు వ్యవహారం ఒకసారి పరిశీలిస్తే కరోనా ను సాకుగా చూపించి ఏపీ ప్రభుత్వం ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ ఉంది .
కానీ అదే సమయంలో కరోనా వైరస్ ప్రభావం అంతంత మాత్రమే అని చెప్పి స్కూళ్లను తెరిచింది.ఇక టీడీపీ విషయానికొస్తే ఏపీలో కరోనా వైరస్ ప్రభావం అంతగా లేదని యధావిధిగా ఎన్నికలు నిర్వహించవచ్చు అంటూ ఎన్నికల కమిషన్ పై ఒత్తిడి చేస్తోంది. కానీ అదే పాఠశాల విషయానికి వచ్చే సరికి కరోనా ఇంత తీవ్రంగా ఉన్న సమయంలో, పాఠశాలలు తెరవాల్సిన అవసరం ఏంటి అంటూ ప్రశ్నిస్తోంది . ఈ రెండు పార్టీల వ్యవహారం చూస్తే కేవలం రాజకీయంగా పైచేయి సాధించాలని తపనే తప్ప, ఈ విషయంలో ఈ రెండు పార్టీలు ఒక్కో సందర్భంలో ఒక్కో విధంగా మాట్లాడుతూ తమ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు గా కనిపిస్తున్నాయి.
ఇక టీడీపీ అధినేత చంద్రబాబు సైతం కరోనా భయంతో హైదరాబాదుకే పరిమితమయ్యారు. ఇప్పట్లో వచ్చేలా కనిపించడం లేదు. ఈ విధంగా రెండు పార్టీలు ఈ కరోనా ను ఒక్కో సందర్భంలో తీవ్రంగా ఉందని, మరో సందర్భంలో నామమాత్రంగా ఉందని చెబుతూ, అందరినీ గజి బిజి చేస్తున్నాయి. అసలు కరోనా ఏపీలో ఉందా లేదా అనేది ఇప్పుడు సామాన్య జనానికి అర్థం కాని ప్రశ్న గా మారింది. దీనికి ఈ రెండు పార్టీలు సమాధానం చెప్పాల్సిందే.
-Surya