ఆంధ్రప్రదేశ్లో మరో రెండ్రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈనెల 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రివర్గ కూర్పుపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏపీ కేబినెట్లో జనసేన అధినేతకు చోటు దక్కుతుందా? దక్కితే ఏ పదవి దక్కుతుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
ఈ నేపథ్యంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకునేందుకు పవన్‌కల్యాణ్ సంసిద్ధత వ్యక్తం చేశారని ఇండియా టుడే ఛానల్ వెల్లడించింది. ప్రధాని మోదీ, కేంద్రమంత్రుల ప్రమాణ స్వీకారానికి జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్, ఆయన భార్య అనా హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇండియా టుడే ఛానల్ రిపోర్టర్ పవన్ కల్యాణ్‌తో మాట్లాడుతూ.. పవన్‌కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ ఛానల్‌లో ఈ విషయంపై స్క్రోలింగ్ ప్రసారం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉప ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నట్లు జనసేన అధినేత వెల్లడించారని అందులో పేర్కొన్నారు.