ఏపీలో ఎన్నికల ఫలితాలకు రంగం సిద్ధం అవుతోంది. ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. జూన్ 4న రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు ప్రకటిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 111 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 2 గంటలకు, 61 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు, మిగతా మూడు నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల్లోపు లెక్కింపు ప్రక్రియ పూర్తిచేస్తామని చెప్పారు.
‘సమస్యాత్మక జిల్లాల్లో లెక్కింపు రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్‌ను అమలు చేసి, సీనియర్ పోలీసు అధికారులను నియమిస్తామని ఈసీ తెలిపారు. పోలింగ్ అనంతరం హింసాత్మక ఘటనలు జరిగిన జిల్లాల్లో ప్రత్యేకదృష్టి పెడతామని వెల్లడించారు. పల్నాడు జిల్లాలో రాష్ట్ర డీజీపీతో కలిసి పర్యటించి అక్కడి పరిస్థితులను పరిశీలించామని.. అధికారులను అప్రమత్తం చేశామని వివరించారు. మొత్తం 175 నియోజకవర్గాలకు… 111 నియోజకవర్గాల్లో 20 రౌండ్లు, 61 నియోజకవర్గాల్లో 21 నుంచి 24 రౌండ్లు, మిగిలిన 3 నియోజకవర్గాల్లో 25కు పైగా రౌండ్లలో ఓట్ల లెక్కింపు ఉంటుందని మీనా పేర్కొన్నారు.