గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ నేతలకు అడుగడుగునా అవమానాలే ఎదురవుతున్నాయి. ఎక్కడికక్కడ ప్రజలు వైసీపీ ఎమ్మెల్యేలు , మంత్రులను నిలదీస్తున్నారు. వారికి సమాధానం చెప్పలేక పలుచోట్ల నాయకులు వెనుదిరుగుతున్నారు. తాజాగా విశాఖ జిల్లా భీమిలి మండలం కె.నగరపాలేనికి వెళ్లిన మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు చుక్కెదురైంది. ఎమ్మెల్యే తమ గ్రామానికి రాకుండా గ్రామ టీడీపీ మాజీ అధ్యక్షుడు తొత్తడి సూరిబాబు, మరికొందరు కలిసి రోడ్డుకు అడ్డంగా పాత చెప్పుల దండ కట్టడం ఉద్రిక్తతకు దారితీసింది. సీఐ కె.లక్ష్మణమూర్తి సిబ్బందితో వెళ్లి దాన్ని తొలగించారు.
సూరిబాబును అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించేందుకు ప్రయత్నించగా నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు మరుపల్లి రాజేంద్ర, యువకులు అడ్డుకున్నారు. అనంతరం గడప గడపకు కార్యక్రమాన్ని తన సెల్‌ఫోన్‌తో చిత్రీకరిస్తున్న రాజేంద్రను స్థానిక వైసీపీ కార్పొరేటర్, ఆ పార్టీ నాయకులు అడ్డుకోవడంతో టీడీపీ నాయకులకు, వారికి మధ్య తోపులాట జరిగింది. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణగడంతో ఎమ్మెల్యే తన కార్యక్రమాన్ని కొనసాగించారు.