మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిటిషన్‌పై తీర్పును ఏపీ హైకోర్టు రిజర్వ్ చేసింది. ఈవీఎం ధ్వంసం కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిన్నెల్లి ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. తీర్పును మంగళవారానికి (మే 28వ తేదీ 2024) రిజర్వ్ చేసింది.
పోలింగ్ రోజున పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పరిధిలోని పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనను ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుంది. వివిధ సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో పిన్నెల్లి.. ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం తీర్పును రేపటికి వాయిదా వేసింది.