ఎట్టకేలకు వైసీపీ ప్రభుత్వానికి మద్దతుగా హైకోర్టు తీర్పు వచ్చింది!

ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు ఏ తీర్పు ఇచ్చినా… ప్రజాస్వామ్యంపై తమకు నమ్మకం వచ్చిందని పెద్ద పెద్ద మాటలే మాట్లాడేస్తున్నాయి ప్రతిపక్షాలు. ఏపీ ప్రభుత్వం కూడా ఈ తీర్పులకు, ప్రతిపక్షాల విమర్శలకూ అలవాటైపోయిందన్న అనుమానం కలుగుతున్న దశలో… వరుస ఎదురుదెబ్బల అనంతరం ఏపీ ప్రభుత్వానికి మద్దతుగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. అది కూడా వైకాపా ప్రభుత్వం ఎప్పటినుంచో ఏదురుచూస్తున్న… జీవో 2430 గురించి. ఈ తాజా ఉత్తర్వ్యులతో ప్రభుత్వంపై వార్తలు రాసే విషయంలో మీడియా సంస్థలు ఆచితూచి వ్యవహరించాలి!


అవును… సచివాలయాలకు రంగుల వ్యవహారం మొదలుకొని నిమ్మగడ్డ ఇష్యూ వరకు దాదాపు ప్రతి విషయంలోనూ జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో వ్యతిరేకంగానే తీర్పులు వచ్చాయి! ఈ క్రమంలో ప్రభుత్వాలు – న్యాయవ్యవస్థల స్పందన అనేది రొటీన్ వ్యవహారం అన్న సంగతి మరిచిన వారు… వాటిని కోర్టు మొట్టికాయలు అంటూ వ్యాఖ్యానించారు కూడా. ఈ క్రమంలో ఎట్టకేలకు వైసీపీ ప్రభుత్వానికి మద్దతుగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతో సర్కార్ ఫుల్ జోష్ లో ఉందనే అనుకోవాలి… ఎందుకంటే… ఈ జీవో 2430 ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధార, వాస్తవదూర తప్పుడు వార్తలు రాసే మీడియా సంస్ధల విషయానికి సంబందించింది మరి!

మీడియాపై ఆంక్షలు విధిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 2430ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు తప్పుబట్టింది. ఈ వ్యవహారంలో న్యాయపరంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని మొదలుపెట్టిన హైకోర్టు… పత్రికా స్వేచ్ఛను హరించేందుకు మీడియా సంస్థలపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు ఈ జీవో తీసుకురాలేదని.. మీడియా సంస్థలు వాస్తవాలను మాత్రమే ప్రజలకు చూపించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని వాదించిన ప్రభుత్వ తరపు న్యాయవాదితో కోర్టు ఏకీభవించింది.

కాగా… ఫేక్ వార్తలను కట్టడి చేసేందుకు గత ఏడాది డిసెంబరులో ఏపీ ప్రభుత్వం జీవో 2430ను జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ జీవో ప్రకారం ప్రభుత్వ పథకాలు ప్రాజెక్టులపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉద్దేశపూర్వక కథనాలను ప్రసారం చేసే సంస్థలు, వ్యక్తులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఆ తప్పుడు కథనాల్లో ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిన పక్షంలో పరువు నష్టం కింద నోటీసులు కూడా జారీ చేస్తారు.