తెలుగు దేశం వాళ్లకు రోడ్లు ఎలా వేస్తాం..? : మంత్రి అంబటి

-

 ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబుకు అడుగడుగునా ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురైంది. పల్నాడు జిల్లా రాజుపాలెంలో మంత్రి ఇవాళ పర్యటించారు. ఈ క్రమంలో పింఛను కోసం దరఖాస్తు చేసుకొని మూడేళ్లైనా రాలేదని ఓ దివ్యాంగురాలు మంత్రిని నిలదీశారు. పక్కనే ఉన్న అధికారులు వాళ్ల ఇంటికి నాలుగు విద్యుత్‌ మీటర్లు ఉన్నాయని.. అందుకే పింఛను ఇవ్వలేదని చెప్పారు. దీంతో మంత్రి సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోతుండగా ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

అదేవిధంగా సమీపంలోనే బుల్లబ్బాయి అనే మరో వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వం, మంత్రిపైనా విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయటం లేదని ధ్వజమెత్తారు. దీంతో అక్కడి పరిస్థితి చూసి మంత్రి వేరే వీధికి వెళ్లిపోయారు. అయితే, ఈ దృశ్యాలు చిత్రీకరించిన మీడియా ప్రతినిధులను మంత్రి పీఏ బెదిరించినట్లు తెలుస్తోంది. పోలీసులు కల్పించుకొని ఫోన్లలో తీసిన వీడియోలను డిలీట్‌ చేయించినట్లు సమాచారం.

అనంతరం రాజుపాలెంలోనే మరో ప్రాంతంలో మంత్రి అంబటి పర్యటిస్తున్న సమయంలో ఓ వ్యక్తి రోడ్లు కావాలని అడిగారు. ప్రభుత్వం నుంచి ఆ వ్యక్తికి వచ్చిన పథకాలను మంత్రి వివరించారు. ఈలోగా మంత్రి పక్కన ఉన్నవారు అతను తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి అని చెప్పగా.. మంత్రి కూడా ‘మీరు తెలుగుదేశమా?’ అని అడిగారు. తెలుగుదేశం వారికి రోడ్లు ఎలా వేస్తామని చెప్పి మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news