ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ‘రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్-2024’లో పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులతో చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలు, మానవ వనరుల గురించి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడుతూ.. ఏపీలో పునరుత్పాదక విద్యుత్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ కోతలు లేకుండా నిరంతరాయంగా విద్యుత్ ను అందించడమే లక్ష్యంగా తాము పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తాము కీలక లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు తెలిపారు. నిర్దేశించుకున్న లక్ష్యాలను అందుకునే దిశగా సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్ లో ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. దీనితో పాటు విద్యుత్ స్టోరేజి సాంకేతికత కూడా వినియోగిస్తామన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 3.0 సంస్కరణలను అమలు చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా విద్యుత్ స్టోరేజి విధానంపై ప్రధానంగా దృష్టి పెట్టామని చెప్పారు. విద్యుత్ స్టోరేజికి ఆంధ్రప్రదేశ్ ను కేరాఫ్ అడ్రెస్ గా నిలిపే లక్ష్యంతో తాము పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ను ఎనర్జీ క్యాపిటల్‌గా గుర్తింపు తీసుకొస్తామన్నారు. దీనికోసం పెద్ద ఎత్తున బ్యాటరీ స్టోరేజి విధానం, పంప్డ్ హైడ్రో స్టోరేజి, ఇతర అభివృద్ధి చెందిన విద్యుత్ స్టోరేజి సాంకేతికతను వినియోగిస్తామని చెప్పారు. రూఫ్‌టాప్ సోలార్, డీ- సెంట్రలైజ్డ్ మైక్రో గ్రిడ్ల ఏర్పాటుతో విద్యుత్ ఉత్పత్తిని ప్రజలకు మరింత చేరువ చేసి, క్షేత్రస్థాయిలో ఇంధన భద్రత పెంచుతామని వివరించారు.