ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఏపీ కేడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ నీరభ్‌కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. ప్రస్తుత సీఎస్ జవహర్‌రెడ్డిని బదిలీ చేస్తూ ఆదేశాలిచ్చిన నేపథ్యంలో కొత్త సీఎస్‌గా నీరభ్‌ను నియమించారు. బుధవారం ఆయన గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో టీడీపీ అధినేత చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో ఇవాళ ఉత్తర్వులు వెలువడ్డాయి.
1987 బ్యాచ్‌కు చెందిన నీరభ్‌కుమార్ ప్రసాద్ ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకూ సీఎస్‌గా ఉన్న కె.ఎస్.జవహర్‌రెడ్డి గురువారం సెలవుపై వెళ్లారు. ఆయన జూన్ నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్నారు. మరోవైపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో సీఎంఓ ఏర్పాటుపై కసరత్తు షురూ అయింది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర సీఎంఓ బాధ్యతలు తీసుకోనున్నారు.