భారీ వర్షాల నేపథ్యంలో నెల్లూరు జిల్లాలోని అధికారులు, ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ముఖ్యంగా సోమవారం రోజున తూర్పుగోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, అనకాపల్లి, బాపట్ల, కృష్ణా, తిరుపతి, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలకు అవకాశముందని తెలిపింది. అయితే, బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో నెల్లూరు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇక నేటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు రావడంతో, కలెక్టరేట్‌లో 1077, 0861 2331261 నంబర్లతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అలాగే చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు సూచన, నెల్లూరు జిల్లాలోని అధికారులు, ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు.