తుపానుగా తీవ్ర వాయుగుండం.. ఏపీలో రేపు వర్షాలు

-

ఏపీలో శనివారం రోజున తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గురువారం తీవ్ర వాయుగుండంగా బలపడిందని.. విశాఖపట్నానికి తూర్పు-ఆగ్నేయంగా 420 కి.మీ., పరదీప్‌ (ఒడిశా)నకు దక్షిణ-ఆగ్నేయంగా 270 కి.మీ, దిఘా (పశ్చిమ బెంగాల్‌)కు దక్షిణ-నైరుతి దిశలో 410 కి.మీ, ఖెపుపరా (బంగ్లాదేశ్‌)కు 540 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించారు. ఇది ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం నాటికి తుపానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని.. ఒకవేళ తుపానుగా మారితి దీనికి మిధిలిగా నామకరణం చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. మిధిలి పేరు మాల్దీవులు సూచించినట్లు పేర్కొన్నారు.

ఈ తుపాను శనివారం తెల్లవారుజామున బంగ్లాదేశ్‌ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని. దీని ప్రభావం వల్ల ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తుపాను ప్రభావంతో సముద్రం అలజడిగా ఉంటుందని.. మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. త్వరలోనే ఏపీ తీరానికి సమీపంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో ఈనెల 28వ తేదీ తర్వాత రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news