ఆంధ్ర ప్రదేశ్‌లో రాబోయే మూడ్రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వానలు కురుస్తాయని వెల్లడించారు. మరోవైపు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు పెరుగుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గురువారం అత్యధికంగా అనంతపురం జిల్లా శెట్టూరులో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం 60 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
మరోవైపు ‘మోచా (మోఖా)’ తుపాను ఆగ్నేయ బంగ్లాదేశ్, ఉత్తర మయన్మార్ మధ్యలో కాక్స్ బజార్ వద్ద మే 14న తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రసుత్తం తుపాను పోర్టుబ్లెయిర్‌కు నైరుతి దిశలో 510 కి.మీ. దూరంలో, కాక్స్‌బజార్ (బంగ్లాదేశ్)కు దక్షిణ నైరుతి దిశలో 1,190 కి.మీ. దూరంలో, సీత్త్వే (మయన్మార్)కు దక్షిణ నైరుతి దిశలో 1,100 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు. ఇది ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం ఉదయానికి మధ్య బంగాళాఖాతంలో అత్యంత తీవ్ర తుపానుగా బలపడుతుందని వెల్లడించారు.