మ్యాట్రిమోనీలో ఒంటరి మహిళలకు ఎర.. రూ.లక్షల్లో..!

-

మ్యాట్రిమోనీ వెబ్ సైట్ లో ఓ మహిళ రెండో పెళ్లి కోసం తన వివరాలు నమోదు చేసుకుంది. అలా పరిచయమైన ఓ అబ్బాయిని పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకుంది. మ్యాట్రిమోనీ సైట్ లో తనలా దరఖాస్తు చేసుకుని అన్ని విధాల తగిన వాడనుకుని ప్రదీప్ అనే యువకుడిని పెళ్లి చేసుకోవటానికి సిద్ధ పడింది. ప్రదీప్ కూడా తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఈలోపు తన కుటుంబ పరిస్థితి బాలేదని కొంత డబ్బు కావాలని కొద్ది రోజులలో తిరిగి ఇచ్చేస్తానని అడిగి తీసుకోవటం మొదలు పెట్టాడు. అలా ఆమె వద్ద నుంచి దఫదఫాలుగా 12.20 లక్షలు తీసుకున్నాడు.

డబ్బులు తిరిగి ఇవ్వాలని మహిళ అడిగినప్పుడు స్పందించకపోవటంతో తాను మోసపోయానని గ్రహించింది. దీంతో వెంటనే విజయవాడ కృష్ణలంక పోలీసులను ఆమె అశ్రయించింది. పోలీసులు ప్రదీప్ ఫోన్ ట్రేస్ చేస్తే అసలు గుట్టు బయటపడింది. తీగ లాగితే డొంక కదిలినట్లు అతని గురించి విచారణ చేస్తే ఇంతకు ముందే ఇదే తరహాలో కాకినాడలో కేసు నమోదైనట్లు తెలిసింది.

ఇప్పటికి పదుల సంఖ్యలో మహిళలను మోసం చేసినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన ప్రదీప్ ప్రస్తుతం హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఉన్నట్లు గుర్తించారు. ప్రదీప్ బీ.టెక్ పూర్తి చేసి సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నట్లు విచారణలో తేలింది. 2017లో వివాహం జరగ్గా.. 2019లో విడాకులు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. డబ్బు మీద ఆశతోనే అక్రమ మార్గంలో అందమైన అమ్మాయిలకు వల వేసి మోసం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ మోసగాడిని కృష్ణలంక పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. విజయవాడకు చెందిన మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో అసలు గట్లు వెలుగులోకి వచ్చింది. మ్యాట్రిమోనీ సైట్లో పరిచయమయ్యే వ్యక్తులను అన్ని విధాలగా విచారణ చేసి తెలిసుకున్నాకే వారితో బంధాన్ని ఏర్పరుచుకోవాలని పోలీసులు సూచించారు. కేసు విచారణలో ఉందని, నిందుతుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news