స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టయి దాదాపు వారం కావొస్తోంది. వారం రోజులుగా నందమూరి ఫ్యామిలీ, నారా ఫ్యామిలీ, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ వెంటనే ఆయణ్ను రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి చంద్రబాబు అక్రమ అరెస్టుపై స్పందించారు.
అక్రమ అరెస్టులు, కేసులకు భయపడేది లేదని బాలకృష్ణ తేల్చి చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు అంశాన్ని ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని అన్నారు. ఈ పోరాటం ఇంతటితో ఆగేది కాదని చెప్పారు. ప్రజల్లో తమ పార్టీకి ఉన్న స్పందన చూసే అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. ప్రజలంతా తమ వెంటే ఉన్నారని బాలకృష్ణ అన్నారు.
మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శాసనసభకు పాదయాత్రగా వెళ్లారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా సచివాలయ అగ్నిమాపక కేంద్రం నుంచి శాసనసభ వరకు పాదయాత్ర చేశారు. టీడీపీ సభ్యుల నిరసనలో వైఎస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. టీడీపీ నేతల నిరసనలో ఆనం, కోటంరెడ్డి, మేకపాటి, శ్రీదేవి పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్టు అక్రమమని గళమెత్తటమే తమ ప్రధాన అజెండా అని టీడీపీ నేతలు స్పష్టం చేశారు.