అది ఎందుకు దాచారు.. వివేకా పీఏను విచారించిన సీబీఐ

-

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే ప్రధాన నిందితులను అరెస్టు చేసి విచారణ జరుపుతున్న అధికారులు తాజాగా  వివేకాకు వ్యక్తిగత సహాయకుడిగా వ్యవహరించిన కృష్ణారెడ్డిని విచారించారు. హైదరాబాద్‌లోని తమ కార్యాలయంలో ఆయనను సుమారు అయిదు గంటలపాటు పలు అంశాలపై ప్రశ్నించారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. వివేకా హత్య జరిగిన స్థలంలో దొరికిన లేఖను ఎందుకు దాచిపెట్టాల్సివచ్చిందనే విషయం పైనే చాలాసేపు సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తనపై దాడి జరిగిన సమయంలో వివేకా రాసినట్లుగా చెబుతున్న లేఖ ఘటనాస్థలిలో ముందుగా కృష్ణారెడ్డి చేతికే చిక్కింది. ఉదయం దొరికిన ఆ లేఖను పోలీసులు అక్కడికి చేరుకోగానే కృష్ణారెడ్డి వారికి ఇవ్వలేదు. వివేకా అల్లుడు రాజశేఖరరెడ్డి దాన్ని దాచి ఉంచమని తనకు సూచించినట్లు తర్వాత కృష్ణారెడ్డి వెల్లడించారు.

అయితే సాక్ష్యాలను తారుమారు చేశారన్న కారణం చూపి హత్య జరిగిన రోజే పోలీసులు కృష్ణారెడ్డిని అరెస్టు చేశారు. ఇదిలాఉంటే ఇటీవల ఈ లేఖ విషయమై కడప ఎంపీ అవినాష్‌రెడ్డి పదేపదే ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version