ఈ నెల 17న విద్యుత్ కార్మిక సంఘాలు తలపెట్టిన చలో విద్యుత్ సౌధాకు అనుమతి లేదని స్పష్టం చేశారు విజయవాడ సీపీ కాంతి రానా. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడ నగర పరిధిలో సెక్షన్ 30, 144 సెక్షన్లు అమలులో ఉన్నాయన్నారు. దయచేసి ఎవరూ చలో విద్యుత్ సౌధకు రావద్దని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ పోలీసుల హెచ్చరికలను మీరి వస్తే నాన్ బేలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
గతంలో ఇలాంటి ఆందోళనల సమయంలో బయట వ్యక్తులు దూరి శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని అన్నారు. చలో విద్యుత్ సౌధ నేపథ్యంలో 3,000 మందికి పైగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. సీసీ కెమెరాలతో మానిటరింగ్ చేస్తున్నామన్నారు.