క్రెడిట్‌ కార్డు బిల్లులో మినిమమ్‌ అమౌంట్‌ చెల్లిస్తున్నారా..?

-

క్రెడిట్‌ కార్డు వాడేవాళ్లకు లిమిట్‌ ఎంత ఉందో తెలుసుకుని ఖర్చు పెట్టడమే కాదు.. బిల్‌ను కూడా కరెక్ట్‌ టైమ్‌ కట్టడం ఒకవేళ కట్టకపోతే ఏం జరుగుతుందో కూడా తెలిసి ఉండాలి. లేకపోతే చాలా నష్టపోతారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది. క్రెడిట్‌ కార్డు బిల్‌ జనరేట్‌ అయినప్పుడు ఉన్న అమౌంట్‌ కన్నా.. మినిమన్‌ పేమెంట్‌ అని ఇంకో అమౌంట్‌ ఉంటుంది. చాలా మంది.. బిల్‌ ఉన్నంత డబ్బులు లేవని మినిమన్‌ అమౌంట్‌ పే చేస్తుంటారు. అలా చెల్లిస్తే వడ్డీ, పెనాల్టీల మోత మోగడం గ్యారెంటీ. అలా కాకుండా ఉండాలంటే?

క్రెడిట్‌ కార్డు వినియోగదారులు బ్యాంక్‌కు చెల్లించాల్సిన బకాయిలూ బాగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ తరహా బకాయిలు రూ.2 లక్షల కోట్లు దాటాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇలా పేరుకుపోవడానికి ప్రధాన కారణం. మినిమమ్‌ బిల్లులు చెల్లించడం. దీని వల్ల పెద్ద మొత్తంలో పెనాల్టీలతో పాటు వడ్డీ సైతం చెల్లించాల్సి వస్తుంది. దీంతో అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సి వస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే?

క్రెడిట్‌ కార్డులో ఉండే ప్రధాన సదుపాయం వడ్డీ రహిత కాలం. ఏదైనా కొనుగోళ్లు జరిపాక 50 రోజుల పాటు (బిల్లింగ్‌ తేదీని బట్టి) ఎలాంటి వడ్డీ చెల్లించకుండానే తిరిగి చెల్లింపులు చేయొచ్చు. ఒకవేళ ఏదైనా నెల డబ్బులు లేకపోతే క‌నీస మొత్తం చెల్లించి మిగ‌లిన మొత్తాన్ని త‌రువాతి నెల‌కు బ‌దిలీ చేసే వెసులుబాటూ ఉంది. ఒక విధంగా ఇది ఉపయోకరమే అయినా చాలా మంది ఇక్కడే అప్పుల్లో కూరుకుపోతున్నారు. అందుకే క్రెడిట్‌ కార్డును తగిన ప్రణాళికతో వినియోగించాలి.

ఛార్జీలు ఇలా..

గడువులోగా క్రెడిట్‌ కార్డు కనీస బిల్లు చెల్లించకపోతే ఆలస్య రుసుములు పడతాయి. బకాయిపై 20 శాతం నుంచి 44 శాతం వరకు వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ కనీస మొత్తం చెల్లిస్తే లేట్‌ పేమెంట్‌ ఛార్జీలు తప్పించుకోవచ్చు. అయితే, కనీస మొత్తం చెల్లించాక మరుసటి బిల్లింగ్‌లో ఏదైనా కొనుగోళ్లు జరిపితే ఆ మొత్తంపైనా వడ్డీ భారం పడుతుంది. దీనివల్ల క్రెడిట్‌ కార్డు వల్ల ఉండే అసలు ప్రయోజనాలు కోల్పోవడంతో పాటు అప్పుల ఊబిలో చిక్కుకుపోయే ప్రమాదం ఉంది. దీంతో బిల్లు చెల్లింపుల కోసం కొత్త అప్పులు చేయాల్సి వస్తుంది. ఇలాంటి అదనపు ఛార్జీలు పడకుండా క్రెడిట్ కార్డును ఎలా తెలివిగా ఉపయోగించాలో చూద్దాం.

క్రెడిట్‌ కార్డు బిల్లులు చెల్లించలేని స్థితిలో ఉంటే ఆ మొత్తాన్ని ఈఎంఐగా మార్చుకోవడం ఉత్తమం. ఈఎంఐగా మార్చినప్పుడు కూడా వడ్డీ, ప్రాసెసింగ్‌ ఫీజు భారం ఉంటుంది. కానీ బకాయిపై విధించే వడ్డీతో పోలిస్తే ఈఎంఐ వడ్డీ కాస్త తక్కువగా ఉంటుంది.

క్రెడిట్ లిమిట్‌ మొత్తాన్ని ఖర్చు చేస్తే అది మీ క్రెడిట్‌ స్కోరుపై ప్రభావం పడుతుందన్నదని గుర్తుపెట్టుకోండి. క్రెడిట్‌ లిమిట్‌లో 30 శాతానికి మించి ఖర్చు చేయకపోవడం ఉత్తమం. ఇది తెలిస్తే ఖర్చు చేసే విషయంలో కాస్త వెనుకాడతారు.

మీ అవసరాలకు తగిన కార్డులను ఎంచుకోవడం ద్వారా అధిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. ఆన్‌లైన్‌ షాపింగ్‌, ట్రావెల్‌ కార్డులను ఎంచుకోవడం ద్వారా ఎంతో కొంత ఆదా చేసుకోగలుగుతారు.

Read more RELATED
Recommended to you

Latest news