రామాయణంలో పిడకల వేట.. అనే ముతక సామెతను వినేవుంటారు. అయితే, ఇప్పుడు ఏపీలో రంగుల్లో రాజకీయాలు చేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తెరమీదికి తీసుకువచ్చింది. ఈ క్రమంలోనే ఆయా కార్యాలయాలకు ఉన్న రంగులను మార్చేద్దామంటూ.. ఓ వీర విధేయుడైన ఓ సలహాదారు చెప్పిన సూచనతో జగన్ పార్టీ పతానికి ఉన్న మూడు రంగులను ఆయాకార్యాలకు పులిమేశారు. ఇది వివాదంగా మారిపోయి.. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కనుసన్నల్లో కొందరు హైకోర్టులో పిల్ వేశారు.
ఇక, ఈ కేసులో హైకోర్టు ఏం చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు కూడా బాబు వర్గానికి పండగ వాతావరణం క్రియేట్ చేసింది. గత ఏడాది కిందట ఎన్నికల్లో ఓడిపోయిన భారమంతా కూడా చంద్రబాబు ఈ తీర్పులతో దిగిపోయిందని అంటున్నారు టీడీపీలో సీనియర్లు. ఇంత వరకు సరే! ఏదో జరిగిందని అనుకుంటే.. జగన్ ప్రభుత్వం తప్పని పరిస్థితిలో రంగులు మార్చుతుందని భావిస్తే.. చంద్రబాబు ఇప్పుడు కొత్త రాజకీయానికి తెరదీశారు. ఇప్పటి వరకు ఆయా కార్యాలయ భవనాలకు వైసీపీ ఆధ్వర్యంలో వేసిన రంగుల ఖర్చును వైసీపీ నేతల నుంచే రాబట్టాలని డిమాండ్ చేశారు.
ఏడాది పాలనలో వైసీపీ ప్రభుత్వం వంద తప్పులు చేసిందని దుయ్యబట్టారు. తీర్పు అమలు చేయలేదు కాబట్టే కోర్టు ధిక్కరణగా తీసుకుని, సీఎస్, సెక్రటరీ, కమిషనర్ హాజరు కావాలని ఆదేశించారని తెలిపారు. వైసీపీ తప్పులకు ముగ్గురు ఉన్నతాధికారులు కోర్టులో నిలబడాల్సి వచ్చిందన్నారు. ఇంత జరిగినా మళ్లీ సుప్రీం కోర్టుకు వెళ్లారని ఆక్షేపించారు. అందరిదీ ఒక దారైతే వైసీపీది మరో దారని ఎద్దేవాచేశారు. రంగు లపై డబ్బులు, అడ్వొకేట్లకు ఫీజులు వృథా అని చంద్రబాబు చెప్పారు.
నిజమే.. ఎందుకంటే.. ఇవి కనిపిస్తున్న ఖర్చులు. కానీ, ధర్మ పోరాట దీక్షల పేరుతో పదుల కోట్లలో డబ్బులు తగలేసినప్పుడు.. ఆ దీక్షల ద్వారా ఏమీ సాధించలేనప్పుడు.. ఆ సొమ్ములు ఎవరి నుంచి రాబట్టాలో కూడా చంద్రబాబు సెలవిస్తే.. బాగుండేది. అంటున్నారు పరిశీలకులు. మొత్తంగా రంగుల్లో రాజకీయ వేట అద్భుతంగా ఉందని అంటున్నారు.