ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రాజకీయం రోజురోజుకు రంజుగా మారుతోంది. ఓవైపు అధికార పార్టీ వైఎస్సార్సీపీ.. మరోవైపు బీజేపీ, జనసేన, టీడీపీల కూటమి.. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ.. ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. వైసీపీపై కూటమి నిప్పులు చెరుగుతుంటే.. వాటికి దీటుగా సీఎం జగన్ జవాబిస్తున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి వైఎస్ షర్మిల తన సోదరుడే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు.
తాజాగా జగన్పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి నిప్పులు చెరిగారు. ఓటమి భయంతోనే వైసీపీ హింసా రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. ఒంగోలులో టీడీపీ నేత మోహన్ రావుపై వైసీపీ దాడిని ఆయన ఖండించారు. రౌడీయిజం చేయకపోతే పూట గడవదన్నట్లు వైసీపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్‌ను ప్రశ్నిస్తే బెదిరిస్తారా? టీడీపీ కార్యకర్త ప్రభావతి కుటుంబాన్ని వైసీపీ రౌడీమూక చంపేస్తామని బెదిరించిందని ఆరోపించారు. ఆమెకు అండగా నిలిచిన టీడీపీ నేత మోహన్‌పై మూకుమ్మడి దాడి చేశారని, ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్తే అక్కడా బీభత్సం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డే కారణమంటున్న చంద్రబాబు.. అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న కొందరు పోలీసులపై ఈసీ దృష్టి పెట్టాలని కోరారు.