ప్రజల గొంతుకగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర నిలిచిందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. యువత గళం నుంచి ప్రజల గొంతుకగా యువగళం ఎదిగిందని పేర్కొన్నారు. నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర 200వ రోజుకు చేరిన సందర్భంగా చంద్రబాబు .. లోకేశ్‌కు, యువగళం బృందానికి అభినందనలు తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి చేపట్టిన మంచి పనిని కొనసాగించాలని చంద్రబాబు ఆకాంక్షించారు. జనవరి 27న మొదలైన ఈ యాత్ర ఇప్పటివరకు 77 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,710 కి.మీ. పూర్తి చేసుకుంది. యువగళం పాదయాత్ర 200 రోజులు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా గురువారం అన్ని నియోజకవర్గాల్లో మూడు కి.మీ. మేర సంఘీభావ పాదయాత్రలు నిర్వహించాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది.
మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు పాదయాత్ర చేపట్టి.. నవులూరు గ్రామం నుంచి యర్రబాలెం వరకు సంఘీభావ యాత్ర నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి మొదలుపెట్టిన పాదయాత్రలో పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.