టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధాన్యం కొనుగోలు సమస్యలపై పోరుబాట పట్టారు. ధాన్యం కొనుగోలు సమస్యలు పరిష్కరించాలని జగన్ సర్కార్ను డిమాండ్ చేస్తూ రైతు పోరుబాట పేరుతో పాదయాత్ర ప్రారంభించారు. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఇరగవరం నుంచి తణుకు వైజంక్షన్ వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది. సుమారు 12 కిలోమీటర్లు చంద్రబాబు నడవనున్నారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులతో మార్గంమధ్యలో మాట్లాడుతూ ఆయన ముందుకు సాగుతున్నారు.
రైతులను రాష్ట్ర ప్రభుత్వం సర్వనాశనం చేసిందని చంద్రబాబు విమర్శించారు. ప్రభుత్వం వైఫల్యంతోనే రైతులు రోడ్డెక్కారని.. తిరుగుబాటు చేస్తూ పోరాటానికి ముందుకొచ్చారని అన్నారు. కల్లాల్లోని ధాన్యం కొనే వరకు రైతుల తరఫున పోరాడుతానని.. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతానని చెప్పారు. రైతులంతా చైతన్యవంతులు కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రైతుపోరుబాట పాదయాత్ర.. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి అంతిమయాత్ర అవుతుందని ఈ సందర్బంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. పాదయాత్రలో పెద్ద సంఖ్యలో రైతులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.