తిరుమల భక్తులకు అలర్ట్..తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత సంచారం భక్తులను భయాందోళనలకు గురిచేస్తుంది. మెట్టు మార్గంలోని పార్వేట మండపం వద్ద ఆదివారం సాయంత్రం శేషాచల అడవి నుంచి రోడ్డు దాటేందుకు ప్రయత్నించిన చిరుతను కారులో వెళుతున్న భక్తులు చూసి ఆందోళనకు గురయ్యారు.
అప్రమత్తమైన తీతీదే అధికారులు గుంపులుగా వెళ్లాలని భక్తులను సూచిస్తున్నారు. శ్రీవారి మెట్టుకు చేరుకునే మార్గంలో శ్రీనివాస మంగాపురం, పార్వేట మండపం, శ్రీవారి మెట్టు వద్ద మూడు బృందాలతో సిఐ రాజశేఖర్ నిగా ఏర్పాటుచేశారు. ఈ మార్గంలో వెళ్లే ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, కాలినడకన వెళ్లే భక్తులను గుంపులు గుంపులుగా పంపిస్తున్నారు. కాగా, శ్రీవారి మెట్టు మార్గంలో పార్వేట మండపం ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు.