ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరం దివాన్ చెరువు అభయారణ్యం ప్రాంతంలో సంచరిస్తున్న చిరుత గత మూడు రోజులుగా కనిపించకుండా పోయింది. మంగళవారం రాత్రి కడియం నర్సరీ ప్రాంతాల్లో చిరుత జాడ కనిపించడం లేదని అటవీశాఖ అధికారులు ధృవీకరించారు. దీంతో ఈ ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దివాన్ చెరువు ప్రాంతం నుంచి కడియం ప్రాంతానికి ఈ చిరుత వచ్చినట్టు పాదముద్రల ఆధారంగా అధికారులు తాజాగా నిర్థారించారు.
కడియం-వీరవరం రోడ్డు మధ్యలో ఉండే దోషాలమ్మ కాలనీలో ఈ చిరుత జాడలు కనిపించడంతో కాలనీవాసులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు ఈ ప్రాంతాన్ని పరిశీలించి చిరుత జాడ ఉన్నట్టు గుర్తించారు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లింది అనేది అంతుపట్టడం లేదు. నర్సరీలలో సీసీ కెమెరాలుంటాయి. ఇప్పుడూ అందరూ భయపడి రైతులు ఎవ్వరూ నర్సరీలలో ఉండటం లేదు. దీంతో చిరుత ఆ ప్రాంతంలోనే ఉందా..? మరెక్కడికైనా వెళ్లిందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గంటకు సుమారు 100 కి.మీ దూరం వెళ్లగలిగే చిరుత ఎక్కడికైనా వెళ్లవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.