జనసేన కార్యకర్తపై శ్రీకాకుళం సిఐ అంజు యాదవ్ చేయించుకోవడం పట్ల ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు తిరుపతికి వచ్చిన పవన్ కళ్యాణ్ సీఐ అంజూ యాదవ్ తీరుపై ఎస్పీని కలిసి ఆమెపై ఫిర్యాదు చేశారు. అంజు యాదవ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎస్పీకి వినతిపత్రం అందించిన అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. శ్రీకాళహస్తిలో జనసేన చాలా ప్రశాంతంగా ఆందోళన చేసిందని.. ఆందోళన చేస్తుంటే సీఐ చేయి చేసుకున్నారని అన్నారు.
సీఐ ప్రవర్తన ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా ఉందన్నారు పవన్ కళ్యాణ్. జన సైనికులు ఎంత క్రమశిక్షణగా ఉంటారో మచిలీపట్నం సభలో చూసామన్నారు. ఈ కేసుని హెచ్ఆర్సి సుమోటోగా స్వీకరించిందని.. అందుకు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో ఇది అందరికీ ఓ గుణపాఠం లాంటిదన్నారు. తాము కూడా క్రమశిక్షణతో ఉంటామని.. ఇకపై పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరించకూడదని అన్నారు.