ఏపీలో జోరుగా కోడి పందేలు.. రూ.కోట్లలో బెట్టింగులు

-

ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఆంక్షలను భేఖాతరు చేస్తూ ఏపీలో కోడి పందేలు సాగుతున్నాయి. పందెం రాయుళ్లు రెచ్చిపోతూ కోట్ల రూపాయల్లో బెట్టింగులు పెడుతున్నారు. భారీగా బరులు ఏర్పాటు చేసి కోడి పందేలు, గుండాట, జూదం వంటి క్రీడలను నిర్వహిస్తూ భారీగా సంపాదిస్తున్నారు. హైకోర్టు ఆంక్షలున్నా పట్టించుకోకుండా సాగుతున్న ఈ పందేలకు తరలి వస్తున్న ప్రజలు బెట్టింగులు కాస్తున్నారు.

కోస్తా జిల్లాల్లో పెద్దఎత్తున కోడి పందేల బరులు ఏర్పాటు చేశారు. మరోవైపు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని అంపాపురంలో జాతీయ రహదారి పక్కనే పందేల నిర్వహణ జాతరను తలపించింది. అంపాపురం బరిలో తొలిరోజే కనీసం 10 నుంచి 15 కోట్ల మేర పందేలు నడిచినట్లు సమాచారం. వీవీఐపీ, వీఐపీల కోసం ఏసీ శిబిరాలు పెట్టి వాళ్ల దగ్గరకే మద్యం, ఆహారం వంటివి అందిస్తున్నారు. వీఐపీల బరిలో తొలి పోటికే నిర్వాహకులు 5లక్షలు పెట్టగా పైపందేలు 15 లక్షల వరకు కాశారు.

మరోవైపు పొట్టేళ్ల పందేల కోసం రెండు శిబిరాలు ఏర్పాటు చేశారు. దాదాపు వంద పొట్టేళ్లను ముందే సిద్ధం చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన మద్యం, బిర్యానీ, భోజనం సహా ఆహార పదార్థాల స్టాళ్లు, పండ్ల రసాలు, కొబ్బరి బొండాలు, సిగిరెట్లు, గుట్కాలమ్మే దుకాణాలన్నింటినీ లీజుకు ఇచ్చేయగా.. ఒక్కో దుకాణానికి మూడురోజులకు లక్షన్నర వరకు వసూలు చేసినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news